జల సంరక్షణపై దృష్టి సారించాలి
అనంతగిరి: భవిష్యత్ తరాల కోసం భూగర్భ నీటి వనరులను కాపాడుకోవాలని భూగర్భ జల సంరక్షణ శాఖ జిల్లా అధికారి రవిశంకర్ తెలిపారు. బుధవారం కొత్తగడి పాఠశాలలో సీడ్ స్వచ్ఛంద సంస్థ.. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేనందున వ్యవసాయ రంగం భూగర్భ జలాలపై ఆధారపడి ఉందన్నారు. వర్షపు నీరు వృథాగా దిగువకు పోకుండా రైతులు పొలాల్లో కుంటలు నిర్మించుకోవాలని సూచించారు. ఆరుతడి పంటలు ఎంచుకొని బిందు సేద్యం చేయాలన్నారు. వ్యవసాయ బోర్లు వేయాలనుకునే రైతులు కొబ్బరికాయ కొట్టే పద్ధతి కాకుండా తమ శాఖను సంప్రదిస్తే బోర్ పాయింట్ల కోసం శాసీ్త్రయంగా సర్వే చేసి స్థలం ఎంపిక చేస్తామని తెలిపారు. అనంతరం సీడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఎస్ నాగబ్రహ్మాచారి మాట్లాడుతూ.. విద్యార్థులు భూగర్భ జలాల సంరక్షణపై కుటుంబ సభ్యులు, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. భూగర్భ జలాలను కాపాడుకుంటామని రైతులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా భూగర్భ జాల సంరక్షణ శాఖ అధికారులు వజీయొద్దీన్, డాక్టర్ కే భాగ్య, వ్యవసాయ విస్తరణ అధికారి సరిత, ప్రధానోపాధ్యాయులు వీరకాంతం, దత్తాత్రేయ, సీడ్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది రవికుమార్, అమరేశ్వరాచారి, మెజీషియన్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
భూగర్భ జల సంరక్షణ శాఖ జిల్లా అధికారి రవిశంకర్
Comments
Please login to add a commentAdd a comment