వికారాబాద్: లగచర్ల ఫార్మా బాధితులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల క్రితం లగచర్లలో అధికారులపై దాడి జరిగిన సమయంలో బాధితులుగా అధికారులు కనిపించారు. వారికి మద్దతుగా ఉద్యోగ సంఘాలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు గళం వినిపించారు. బీజేపీ సైతం అధికారులపై జరిగిన దాడిని ఖండించింది. పోలీసుల రంగ ప్రవేశం, అరెస్టులతో సీన్ మొత్తం మారిపోయింది. వారం తిరిగేలోగా ఫార్మాసిటీలో భూములు కోల్పోనున్న రైతులు బాధితులుగా మారారు. లగచర్ల ఘటన అనంతరం పోలీసుల తీరు కూడా పరిస్థితి మారడానికి కారణమయ్యింది. ఇప్పటికే ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు రైతులకు అండగా నిలిచారు. దీంతో వారు బయటకు వచ్చి తమ గోడును వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ నేతలు సైతం ఫార్మా బాధితులకు మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో అధికార పార్టీ ఇరకాటంలో పడింది. దాడి ఘటన నేపథ్యంలో పరిగి డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డిపై బదిలీ వేటు పడింది. అతన్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వలు జారీ చేశారు. దీంతో పోలీసు యంత్రాంగం కూడా ఆత్మరక్షణలో పడిపోయింది.
జీవన్మరణ సమస్య కావడంతోనే..
మూడు నెలల క్రితం ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల్ మండలంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. లగచర్ల, పోలెపల్లి, హకింపేట్, రోటిబండ తండా, పులిచర్లగుట్ట తండాల పరిధిలో పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ ఐదు గ్రామాల పరిధిలో 1,358 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఇందులో 547 ఎకరాలు అసైన్డ్ భూమి, 90 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా.. 721 ఎకరాల పట్టా భూమి ఉంది. మొత్తం 800 రైతులు భూములు కోల్పోనున్నారు. ఒక్కో రైతు సగటున ఎకరం నుంచి ఒకటిన్న ఎకరా భూమి కోల్పోనున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది సన్న చిన్నకారు రైతులే. వీరికి ఈ భూములు తప్ప వేరే జీవనోపాధి లేదు. దీంతో ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
వ్యతిరేక గళం
ప్రభుత్వం ఫార్మాసిటీని ప్రకటించింది మొదలు రైతులు వ్యతిరేక గళం వినిపిస్తూనే ఉన్నారు. వీరికి మొదట్లో బీఆర్‌ఎస్ మాత్రమే మద్దతు ప్రకటిస్తూ వచ్చింది. లగచర్ల ఘటన తర్వాత అరెస్టుల పర్వం మొదలు కావడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. రైతులు సైతం ఏ మాత్రం జంకకుండా పోరుకు సిద్ధమయ్యారు. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. అరెస్టుల తర్వాత బీఆర్‌ఎస్ తన వాయిస్‌ను మరింత పెంచింది. బాధితులు రాష్ట్ర, దేశ రాజధానుల్లో తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించారు. దీంతో వారికి మరింత మద్దతు పెరిగింది. బీజేపీ సైతం లగచర్ల బాధిత రైతులకు అండగా నిలవడంతోపాటు గళం వినిపిస్తోంది. వామపక్ష పార్టీలు సైతం రంగంలోకి దిగాయి. తాజాగా మంగళవారం మహిళా సంఘాలు సైతం లగచర్ల బాధిత రైతులను పరామర్శించేందుకు వెళ్లగా బొంరాస్‌పేట పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, అడ్వకేట్ రాజశేఖర్ నిరసన గళం వినిపించారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు సాగిస్తున్న దమన కాండను ఆపాలని హితవు పాలికారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ మూల్యాం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలా రోజురోజుకూ ఫార్మా బాధిత రైతులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం, అధికార పార్టీపై వ్యతిరేక గళం వినిపించే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment