ఇది ప్రభుత్వమా.. పోలీసు రాజ్యమా
బొంరాస్‌పేట: రాజ్యాంగబద్ధంగా కల్పించిన మహిళా హక్కులను కాలరాస్తే ఊరుకోమని ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్ (పీఓడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ వి.సంధ్య అన్నారు. జాతీయ స్థాయికి పాకిన లగచర్ల ఘటనలో స్థానిక మహిళలు జాతీయ మహిళా సంఘాలకు చేసిన వినతికి స్పందించి తాము గ్రామానికి వెళ్తుండగా.. పోలీసులు ప్రభుత్వానికి వత్తాసుగా ఉంటూ తమను అడ్డగించడం సరికాదని మండిపడ్డారు. ‘‘మేం రాజకీయాలకు వ్యతిరేకం.. పోలీసులు నిర్వర్తిస్తున్న విధులు హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయి. నిర్బంధాలు, వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వానికి మంచిది కాదు. ఇది ప్రజా ప్రభుత్వమా? పోలీసు నియంత రాజ్యమా? ముఖ్యమంత్రి వైఖరి ఇదేనా?’’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం లగచర్లకు వెళ్తున్న జాతీయ, రాష్ట్ర మహిళా సంఘాల నేతలను మండల పరిధిలోని తుంకిమెట్ల వద్ద అడ్డుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో మహిళా పోలీసులు, మహిళా నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనుసూయ, పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు ఝాన్సీ, దామగుండం జేఏసీ నాయకురాలు గీత, ఓయూ జర్నలిజం ప్రొఫెసర్ పద్మజషా, వలస కార్మికుల సంఘం సిస్టర్ లీజీ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
భూములు లాక్కోవడం బాధాకరం
పలువురు మహిళా నేతలు మాట్లాడుతూ.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలతోనే కుప్పకూలిందన్నారు. కాంగ్రెస్ కూడా అదే పంథాను అవలంబిస్తోందని తెలిపారు. ఆరుగ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి.. పేద ప్రజల వద్ద భూములను లాక్కోవడం, ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడం బాధాకరమని తెలిపారు. బాధితులకు తాము అండగా ఉంటామని స్పష్టంచేశారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, ఐస్‌ఐ ఎండీ అబ్దుల్ రవూఫ్ వారిని సముదాయించి రెండు గంటల తర్వాత తిరిగి పంపించారు. అంతకుముందు వీరి అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్, సీఐటీయూ జిల్లా నాయకుడు మహిపాల్ ధర్నాకు దిగారు. వీరి వెంట వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, రైతుసంఘం రాష్ట్ర నాయకుడు శోభన్‌నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, కె.శ్రీనివాస్ తదితరులున్నారు. ఇదిలా ఉండగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు గురువారం లగచర్లకు రానున్నట్లు తెలిపారు.
హక్కులను కాలరాస్తే ఊరుకోం
నిర్బంధాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వానికి మంచిది కాదు
పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య
లగచర్ల వెళ్తుండగా మహిళా నేతల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment