సంబరం
ధ్యానం..
రెండో రోజుకు చేరిన ధ్యాన మహాయాగం
● హాజరైన సినీ స్టంట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్
● వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ధ్యానులు
కడ్తాల్: సాధనతో సాధించలేనిదంటూ ఏదీ లేదని ధ్యానగురువు పరిణిత పత్రి అన్నారు. మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రంలో కొనసాగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగాలు ఆదివారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు సంజయ్ కింగి ఆధ్వర్యంలో ప్రాతఃకాల సంగీత ధ్యానం నిర్వహించారు. అనంతరం ధ్యానులను ఉద్దేశించి పరిణిత పత్రి మాట్లాడారు. నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉండాలని, దానికి సాధనే మార్గమన్నారు. ధ్యాన యజ్ఞం నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ధ్యానాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరికీ ధ్యానం నేర్పుతూ పత్రీజీ సంకల్పాన్ని నెరవేర్చాలని కోరారు. ప్రపంచాన్ని ధ్యానమయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సినీ స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా దానిలోని సూక్ష్మాన్ని గ్రహించి సత్యం తెలుసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని, ఆత్మ జ్ఞానం తెలుసుకున్న వారే ధ్యానులన్నారు. అనంతరం సుభాష్‌పత్రీజీ, స్వర్ణమాల పత్రిజీల వీడియో సందేశం ధ్యానులకు అందించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు గురువులు ఆధ్యాత్మిక, ధ్యాన సందేశం వినిపించారు. పిరమిడ్ మాస్టర్‌లు తమ ధ్యాన అనుభవాలను వివరించారు. ఆదివారం కావడంతో వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన ధ్యానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment