మహమ్మారిపై సమరం
వ్యాధి అంతమే లక్ష్యం
కుష్టును అంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యాధి సోకిన వ్యక్తులు వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే తగ్గుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అంగవైకల్యంతోపాటు మరికొంత మందికి వ్యాధి సోకే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ రవీంద్రయాదవ్, జిల్లా టీబీ, లెప్రసీ ప్రోగ్రాం అధికారి
కొడంగల్ రూరల్: కుష్టు వ్యాధిని తరమికొట్టేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతూ జిల్లా వ్యాప్తంగా 14 రోజులపాటు సర్వే నిర్వహించారు. వ్యాధిగ్రస్తులు భయాందోళనలకు గురికాకుండా మందులు వాడినట్లయితే నయమవుతుందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వ్యాధి మరొకరికి సోకడంతోపాటు అంగవైకల్యం కలిగే అవకాశం ఉంటుందని వైద్యాధికారులు చెబుతున్నారు.
వ్యాధి వ్యాప్తి
కుష్టువ్యాధి అనేది లెప్రో మైక్రో బ్యాక్టీరియా లెప్రమోటోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస ద్వారా బ్యాక్టీరియా ఇతరులకు చేరుతుంది. ఇది సోకిన ఏడు రోజుల వరకు బ్యాక్టీరియా బతికే ఉంటుంది. శరీరంపై తెల్లటి, రాగి రంగు మచ్చలు రావడం, ఆ ప్రదేశంలో స్పర్శ లేకపోవడం, చేతి గోళ్లలో, నరాల్లో తిమ్మిర్లు, శరీరంపై వెంట్రుకలు రాలిపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. వైద్యుల సలహా మేరకు మందులు వాడితే వ్యాధి తగ్గే అవకాశం ఉంటుంది.
ముందుగా గుర్తిస్తే మంచిది
కుష్టు వ్యాధి అనేది అంత ప్రమాదకరమైనది కాదని.. నయం చేయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం కబళించే ప్రమాదం ఉంటుంది. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా సమీపంలోని ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేసుకుని వ్యాధి నిర్దారణతో మందులు వాడితే తగ్గిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందించడంతోపాటు మందులను ఉచితంగా అందజేస్తున్నారు.
86 మందికి చికిత్స
ప్రతీ కుటుంబంలో వారి ఆరోగ్య పరిస్థితిని గుర్తిస్తూ వ్యాధి సంబందిత లక్షణాలున్న వారి వివరాలు నమోదు చేశారు. 3,332 మందిని అనుమానితులుగా గుర్తించి వారి వివరాలను సేకరించారు. ఇందులో ఎనిమిది మందికి మాత్రమే కుష్టు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ జరిగిందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 78 మందికి చికిత్స అందిస్తుండగా సర్వేలో గుర్తించిన ఎనిమిది మందితో కలిపి మొత్తం 86 మందికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.
కుష్టు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
3,332 మంది అనుమానితుల్లో ఎనిమిది మందికి నిర్ధారణ
అవసరమైనవారికి చికిత్స, ఉచితంగా మందులు
Comments
Please login to add a commentAdd a comment