కాపుకాసి.. డబ్బు దోచి !
జిల్లాకు పాకిన అటెన్షన్ డైవర్షన్ చోరీలు ● అమాయక ప్రజలే టార్గెట్ ● పోలీసులమంటూ బెదిరింపులు ● తరచూ ఇలాంటి ఘటనలు ● తాజాగా రూ.50 వేలతోఉడాయించిన దొంగలు ● కేసుల నమోదులో నిర్లక్ష్యం
వికారాబాద్: జిల్లాలో పట్టపగలే జరుగుతున్న దోపిడీలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు నగరానికే పరిమితమైన ఈ తరహా అటెన్షన్ డైవర్షన్ చోరీలు జిల్లాకు పాకాయి. బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల్లో డబ్బులు డ్రా చేసే వారిని టార్గెట్‌గా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్నారు.
● వారం రోజుల క్రితం నవాబుపేట మండలం నారెగూడ గ్రామానికి చెందిన గంగ్యాడ నర్సింహులు డబ్బులు డ్రా చేసుకునేందుకు వికారాబాద్ పోస్టాపీసుకు వచ్చాడు. తన ఖాతా నుంచి రూ.1.94 లక్షలు డ్రా చేసుకొని రైల్వే స్టేషన్ మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. నర్సింహులు డబ్బులు డ్రా చేయడం గమనించిన ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి అడ్డగించారు. తాము పోలీసులమని.. నీ బ్యాగ్‌లో గంజాయి ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందని భయపెట్టారు. చెక్ చేయాలని బ్యాగ్ తీసుకున్నారు. అందులోంచి రూ.50 వేల బండల్ తీసుకుని బైక్‌పై ఉడాయించారు. నర్సింహులు తేరుకొనే లోపు అక్కడి నుంచి మాయమయ్యారు. ఈ విషయమై అదే రోజు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
● ఎనిమిది నెలల క్రితం కూడా వికారాబాద్ పట్టణంలో సరిగ్గా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పట్టణంలోని ఓ బ్యాంకులో నగదు డ్రా చేసుకున్నాడు. ఇది గమనించిన ఇద్దరు దుండగులు కొంత దూరం వెంబడించారు. ఎవరూ లేని ప్రదేశంలో డబ్బు తీసుకెళ్తున్న వ్యక్తిని ఆపారు. తాము పోలీసులమని, నీ బ్యాగ్‌లో నకిలీ నోట్లు ఉన్నాయని భయపెట్టారు. బ్యాగులోని నోట్ల ను పరిశీస్తున్నట్లు నటించి నగదుతో ఉడా యించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కానీ ఇప్పటి వరకు కేసులో ఎలాంటి పురోగతి లేదు.
● ఆరు నెలల క్రితం నవాబుపేట మండలం మీనపల్లికలాన్‌కు చెందిన తల్లి కూతురు అత్తగారి ఇంటికి బయలు దేరారు. గేట్ వనంపల్లి సమీపంలో వికారాబాద్ – సాదాశివాపేట్ రోడ్డుపై నిలబడ్డారు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో దుండగులు (కొందరు ఆడ, మరికొందరు మగ) ఫ్యామిలీలా కారులో వచ్చి లిఫ్ట్ ఇస్తామని తల్లికూతుళ్లను బలవంతంగా ఎక్కించుకున్నారు. కొద్ది దూరం వెళ్లగానే వారి మెడలోని బంగారు గొలుసులు లాక్కున్నారు. కారును కొంచం మెళ్లగా పోనిచ్చి వారిని కిందకు తోసేసి పరారయ్యారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా సిబ్బంది కేసు నమోదు చేసుకోలేదు. దీంతో వేరే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్ కేసు నమోదు చేసి నవాబుపేట పీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో కూడా ఎలాంటి పురోగతి లేదు. ఇవి ఉదాహరణలు కొన్ని మాత్రమే.. ఇటీవలు పలు పోలీస్ స్టేషన్ల పరిఽధిలో బైకులు, దొంగతనాలు జరిగినా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
కానరాని పారదర్శకత..
కేసుల నమోదులో జిల్లా అధికారులు చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. కేసుల నమోదులో పారదర్శకత పాటిస్తున్నామని పైస్థాయి పోలీసు అధికారులు చెబుతున్నా ఫిర్యాదు బుట్టదాఖలు అవుతున్నట్లు తెలుస్తోంది.
బాధితులకు జరగని న్యాయం
సాధారణంగా కొన్ని కేసులను బాధితులు పోలీస్ స్టేషన్‌లో పరిష్కరించుకొని వెళుతుంటారు. కానీ దొంగతనాలు, చీటింగ్ తదితర కేసుల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. కేసు నమోదై దొంగలు దొరికినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది.. పోలీసులు రికవరీ చేసిన సొమ్ము బాధితులకు దక్కుతుంది. ఒకవేళ కేసులు నమోదు చేయకుంటే దొంగలు దొరినా నష్టపోయిన వారికి సొత్తు ఇవ్వాటానికి వీలుపడదు. దీంతో బాధితులు నష్టపోతారు. కానీ చాలా కేసుల్లో పోలీసులు ఫిర్యాదులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment