మాస్టర్ అథ్లెటిక్స్‌లో తాండూరు గృహిణి సత్తా
48 ఏళ్ల వయసులో రెండు గోల్డ్ మెడల్స్
తాండూరు టౌన్: క్రీడలు అనేవి కేవలం యుక్త వయసులో ఉన్న వారికి మాత్రమే సరిపోతాయి అనుకునే వారిని ఆశ్చర్యగొలిపే విధంగా తాండూరుకు చెందిన ఓ గృహిణి నాలుగు పదుల వయసులో అథ్లెటిక్స్‌లో రాణించి సత్తా చాటింది. పెళ్లి.. సంతానం కలగగానే ఇక వంటింటికే పరిమితం కావాలి అనుకునే వారికి ఈమెని చూస్తే ఏదో నూతన ఉత్సాహం రాకమానదు. చిన్నప్పుడు పాఠశాల, కళాశాల క్రీడల్లో విశేషంగా రాణించి, ఆ తర్వాత కాలక్రమంలో పెళ్లి అయిపోయి, తిరిగి క్రీడల్లో తమ ప్రావీణ్యాన్ని చాటుకునే అవకాశం లేక ఎందరో తమ టాలెంట్‌ను గుండెల్లోనే దాచుకుంటున్నారు. అయితే అందరిలా కాకుండా వయసు పెరిగినా క్రీడల పట్ల తనకున్న మమకారం, ఆరోగ్య రీత్యాఫిట్‌నెస్‌పై ఉన్న ఆకాంక్ష మాత్రం దూరం కాలేదు. ఈక్రమంలోనే తెలంగాణ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించి మెడల్స్ సాధించి మహిళలు అనుకుంటే వయసుతో పనిలేకుండా క్రీడల్లో రాణించవచ్చని నిరూపించారు తాండూరు పట్టణానికి చెందిన 48 ఏళ్ల సంతోషి. భర్త నటరాజ్ ప్రోత్సాహంతో ఈ ఘనత సాధించి శభాష్ అనిపించుకున్నారు.
రెండు బంగారు పతకాలు
మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4,5వ తేదీల్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో సంతోషి పాల్గొని సత్తా చాటారు. 45 – 50 ఏళ్ల విభాగంలో సంతోషి చక్కటి ప్రదర్శనతో లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్‌లలో రెండు బంగారు పతకాలు సాధించారు. అథ్లెట్ సంతోషిని స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు. జాతీయ పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.
జాతీయ స్థాయి పోటీలకు..
అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సంతోషి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని త్రిశూర్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి మాస్టర్ అథ్టెటిక్స్‌లో పోటీల్లో పాల్గొననున్నారు. అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన సంతోషిని తాండూరు వాసులు అభినందనలతో ముంచెత్తారు.
ఫిట్‌నెస్ ఉండాలి
వివాహం అయిపోయింది, ఇక మనకు ఆటలు ఎందుకులే అని మహిళలు అనుకోకూడదు. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి. మహిళలు క్రమం తప్పకుండా నిత్యం వ్యాయామం చేసి ఫిట్‌నెస్ సాధించాలి. 48 ఏళ్ల వయసులో నేను అథ్లెటిక్స్‌లో రాణించడానికి కారణం ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడమే. మహిళలు ఏదైనా సాధించవచ్చని నిరూపించడానికే నేను క్రీడా పోటీల్లో పాల్గొన్నాను.
– సంతోషి, తాండూరు
చిన్ననాటి నుంచే..
తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్‌లో 1992లో పదో తరగతి, సింధు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియేట్, హైదరాబాద్‌లోని భవన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు సంతోషి. 2001లో వ్యాపారి నటరాజ్‌ను వివాహం చేసుకున్న ఆమెకు డిగ్రీ, ఇంటర్ చదువుతున్న ఇద్దరు కుమారులున్నారు. పాఠశాల వయసు నుంచే రన్నింగ్, ఖోఖో, లాంగ్‌జంప్ తదితర క్రీడల్లో చాంపియన్‌గా నిలిచిన సంతోషి, అదే తీరును మాస్టర్ అథ్లెటిక్స్‌లో కూడా ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment