పోస్టల్ స్టాంప్‌లపై అవగాహన ఉండాలి
కలెక్టర్ ప్రతీక్ జైన్
అనంతగిరి: విద్యార్థులకు బాల్యం నుంచే పోస్టల్ స్టాంప్‌లపై అవగాహన ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పోస్టల్ శాఖ ప్రత్యేక స్టాంపుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 7 నుంచి 9వ తేదీ వరకు అనంతగిరి ఫెక్స్ పేరిట ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థులే అని.. తాను కూడా తెలుగు, కన్నడ భాషలు నేర్చుకుంటున్నట్లు తెలిపారు. నేను పదో తరగతి చదివే సమయంలో మా పెదనాన్న ఇల్లు ఖాళీ చేశాడని.. ఆ సమయంలో ఒక పుస్తకం చూసి ఆశ్చర్య పోయానని తెలిపారు. ఆ పుస్తకంలో దాదాపు 100 స్టాంపులు ఉన్నాయని.. వాటి గురించి తెలుసుకోవడానికి 30 నుంచి 40 రోజుల సమయం పట్టిందన్నారు. గతంలో రక్ష బంధన్, దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టల్ కార్డులు వచ్చేవన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ తపాలా శాఖ అధికారులు సుబ్రహ్మణ్యం, ఎంబీ ప్రసాద్, శ్రీనివాష్, సిబ్బంది కేశవరెడ్డి పాల్గొన్నారు.
ఆంగ్ల బోధనకు ప్రాధాన్యత కల్పించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాలల్లో ఇంగ్లిష్‌ను సులభతరంగా బోధించడంపై మండల విద్యాధికారులు, ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులకు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు సులభతరంగా అర్థమయ్యేలా బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, డీఈఓ రేణుకాదేవి, వయోజన విద్య అధికారి శ్రీనివాస్ గౌడ్, మైనార్టీ బాలికల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ మహబూబా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment