నేడు డయల్ యువర్ డీఎం
తాండూరు టౌన్: తాండూరు డిపో పరిధిలోని ఆర్టీసీ బస్సు సౌకర్యాలు, సమస్యలపై నేడు (బుధవారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తాండూరు డిపో మేనేజర్ సురేష్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2నుంచి 3గంటల వరకు సెల్ నంబర్ 9959226251కు డయల్ చేసి మీరు ఎదుర్కొంటున్న బస్సు ప్రయాణ సమస్యలు, సలహాలు, సూచలను తెలియజేయాలన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.
ఆంగ్లంపై పట్టు సాధించాలి
అదనపు కలెక్టర్ ఉమాహారతి
మోమిన్‌పేట: విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ఉమాహారతి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో క్లస్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వారంలో రెండు రోజులు విద్యార్థులకు ఆంగ్ల పదాలు నేర్పించాలన్నారు. మాట్లాడేలా తర్ఫీదు ఇవ్వాలన్నారు. అలాగే కమ్యూనికేషన్ స్కీల్స్‌లో పట్టు సాధించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశం, ప్రధానోపాధ్యాయులు గౌరి శంకర్, సమ్మయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోండి
ఏఓ పూజ
కొడంగల్ రూరల్: జనవరి ఒకటవ తేదీ 2025 నాటికి కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వారు, ఒక్కసారి కూడా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోని అన్నదాతలు పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏఓ బీ పూజ సూచించారు. మంగళవారం పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. భూమి పాస్ బుక్ జిరాక్స్, ఆధార్‌కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్(సేవింగ్ ఖాతా)లతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో పథకం పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ
తాండూరు టౌన్: తాండూరు టౌన్ నూతన ఎస్‌ఐగా వన్నెగూడ రమేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన బషీరాబాద్ మండల ఎస్‌ఐగా విధులు నిర్వర్తించారు. గతేడాది సెలవుపై వెళ్లారు. ప్రస్తుతం ఆయనను తాండూరు టౌన్ ఎస్‌ఐగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.
విద్యార్థుల సామర్థ్యంమెరుగుపడాల్సిందే
స్టేట్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ ఐ.వి.సుబ్బారావు
బొంరాస్‌పేట: తరగతుల వారీగా విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడాల్సిందేనని స్టేట్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ ఐ.వి.సుబ్బారావు సూచించారు. మంగళవారం బొంరాస్‌పేట స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరై ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల సామర్థ్యాలు ఎలా ఉన్నాయో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈఓ హరిలాల్, సీఆర్‌పీలు జీవన్‌కుమార్, నవీన్‌కుమార్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రసాభాసగా వార్డు సభ
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌లో మంగళవారం నిర్వహించిన వార్డు సభ రసాభాసగా మారింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు ఒకరినొకరు విమర్శించుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక జాబితా మొత్తం ఏకపక్షంగా ఉందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. అర్హులకు కాకుండా అనర్హులకే పథకాలు ఎక్కువగా అందేలా ఉన్నాయని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment