నేడు రైతు నిరసన దీక్ష | - | Sakshi
Sakshi News home page

నేడు రైతు నిరసన దీక్ష

Published Mon, Feb 10 2025 7:19 AM | Last Updated on Mon, Feb 10 2025 7:19 AM

నేడు రైతు నిరసన దీక్ష

నేడు రైతు నిరసన దీక్ష

కొడంగల్‌ రూరల్‌: నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న రైతు నిరసన దీక్షను విజయవంతం చేయాలని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పట్టణంలోని బీఆర్‌ఎస్‌ నాయకులు అడ్వకేట్‌ మధుసూదన్‌రెడ్డి నివాసంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కోస్గి జెడ్పీహెచ్‌ఎస్‌ ఆవరణలో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని.. ఎకారకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అధికారం దక్కించుకునేందుకు అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలులో విఫలమవుతోందని ఆరోపించారు. కేసీఆర్‌ హయాంలో రైతులకు పెట్టుబడి సాయం సాగుకు ముందే రైతు ఖాతాల్లో నగదు జమయ్యేదని.. ప్రస్తుతం రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. మహిళలకు రూ.2,500, తులం బంగారం, పెంచిన పెన్షన్‌ అమలకు నోచుకోవడం లేదని.. పథకాల అమలు డిమాండ్‌తో చేపడుతున్న నిరసన కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు, రైతులు, యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ మధుసూదన్‌రావు, మాజీ ఎంపీపీ దయాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ రమేష్‌బాబు, నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి, నవాజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులు స్వచ్ఛందంగా హాజరు కావాలి

బొంరాస్‌పేట: బీఆర్‌ఎస్‌ రైతుదీక్షకు నియోజకవర్గంలోని రైతులంతా స్వచ్ఛందంగా రావాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని తుంకిమెట్లలో బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులతో చర్చించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పలువురు పార్టీ ముఖ్య నేతలతో కలిసి మధ్యాహ్నం పరిగి నుంచి తుంకిమెట్లకు రానున్నారు. తుంకిమెట్లలో పార్టీ జెండావిష్కరణ చేస్తారని చెప్పారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని నాందార్‌పూర్‌, లగచర్ల గేట్‌, హకీంపేట మీదుగా కోస్గిలో చేపడుతున్న రైతు దీక్షలో పాల్గొంటారని చెప్పారు. కేటీఆర్‌ వెంట మాజీ మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతిరాథోడ్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, కౌశిక్‌రెడ్డి, బాల్కసుమన్‌ తదితర ముఖ్య నేతలు హాజరవుతారని చెప్పారు. శాంతియుతంగా చేపట్టిన రైతుదీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యాదగిరి, మహేందర్‌రెడ్డి, శేరి నారాయణరెడ్డి, నెహ్రూనాయక్‌, తిరుపతయ్య, మల్లేశ్‌గౌడ్‌, అవినాశ్‌ తదితరులున్నారు.

హాజరుకానున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హామీలు విస్మరిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీద్దాం

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement