వైఎస్సార్‌సీపీలోనే కాపులకు ప్రాధాన్యం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోనే కాపులకు ప్రాధాన్యం

Published Wed, May 8 2024 5:15 AM

వైఎస్సార్‌సీపీలోనే కాపులకు ప్రాధాన్యం

గోపాలపట్నం: రాష్ట్రంలో కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని, కాపులను చిన్నచూపు చూసిన పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని కాపునాడు అధ్యక్షుడు తోట రాజీవ్‌ అన్నారు. మర్రిపాలెం వుడాలేఅవుట్‌ వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 31 అసెంబ్లీ స్థానాలు, ఐదు ఎంపీ స్థానాలను కాపులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేటాయించారన్నారు. సామాజిక న్యాయం అంటే ఇదేనని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కేవలం 23 స్థానాలు మాత్రమే కాపులకు కేటాయించారన్నారు. కాపులంటే ఈ పార్టీలకు చిన్నచూపని పేర్కొన్నారు. చంద్రబాబు కాపులపై కుట్రలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కాపుల ద్రోహి అని విమర్శించారు. చంద్రబాబు భీమిలి టికెట్‌ అమ్మితే గంటా కొనుక్కున్నాడన్నారు. ఈ వ్యాపార రాజకీయాలకు త్వరలోనే ఫుల్‌స్టాప్‌ పడడం ఖాయమన్నారు. రాష్ట్రంలో అన్ని చోట్లా వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. పశ్చి మ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్‌కుమార్‌ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని జోస్యం పలికారు.

కాపులంటే గణబాబుకు ధ్వేషం

డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే గణబాబుకు కాపులంటే ఎప్పుడూ ధ్వేషమేనన్నారు. కాపుల ఎదుగుదలను ఓర్వలేని నక్కజిత్తుల నాయకుడు గణబాబు అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడివాడ నాగమణి పోటీ చేస్తే బహిరంగంగానే వ్యతిరేకించి ఓడించిన స్వార్థపరుడు గణబాబు అని అన్నారు. నాగమణిపై కోపంతో టీడీపీ జెండాలు తగలబెట్టిన చరిత్ర గణబాబుదన్నారు. కాపు ద్రోహి అయిన గణబాబుకు తెలుగుదేశం పార్టీ టికెట్‌ ఇవ్వడం బట్టి ఆ పార్టీ ఎంత నీచమైందో కాపులు గమనించాలని కోరారు. గత ఎన్నికల ముందు కాపు కల్యాణ మంటపం నిర్మిస్తామని పద్మనాభ నగర్‌లో శంకుస్థాపన చేసిన గణబాబు తర్వాత పట్టించుకోవడమే మానేశాడన్నారు. వదిలేశాడు. దీనిపై ఆడారి ఆనంద్‌కుమార్‌ స్పందించి, ప్రభుత్వంతో చర్చించి రూ.2 కోట్లతో కల్యాణ మండపం నిర్మించారు. పశ్చి మ పరిశీలకురాలు పీలా ఉమారాణి మాట్లాడుతూ కాపు సమాజిక వర్గానికి జగనన్న ఎంతో మేలు చేశారని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో నాయకుడు ఆడారి ఆనంద్‌కుమార్‌ను గెలిపించుకోవాలని పిలునిచ్చారు. పివి సురేష్‌ మాట్లాడుతూ 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న గణబాబు నియోజకవర్గంలో ఏం చేశారని ప్రశ్నించారు. హెచ్‌పీసీఎల్‌ సీఎస్సార్‌ నిధులు రూ.34 కోట్లలో గణబాబు అవినీతికి పాల్పడిందని నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు మోహన్‌రావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

కాపులను చిన్నచూపు చూసిన పార్టీలకు బుద్ధి చెబుతాం

కాపు నాడు అధ్యక్షుడు తోట రాజీవ్‌

Advertisement
Advertisement