గత పోరాటాల స్ఫూర్తితో ‘ఉక్కు’ను రక్షించుకుందాం
మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ
సీతమ్మధార: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాకంటక నిర్ణయాలపై పోరాడి విజయం సాధించిన చరిత్ర ఉత్తరాంధ్రదని.. ఆ స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిశ్రమను రక్షించుకుందామని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ పిలుపునిచ్చారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఉక్కు పరిరక్షణ దీక్షలో మహిళలు, విభిన్న ప్రతిభావంతులు, గిరిజనులు, పింఛన్‌దారులు పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఏజెన్సీలో బాకై ్సట్ నిక్షేపాల తవ్వకాలను నిలువరించగలిగాం. ప్రైవేట్ విద్యుత్ థర్మల్ ప్లాంట్లు రాకుండా అడ్డుకున్నాం. హిందూస్థాన్ షిప్‌యార్డ్‌ను రక్షణ రంగంలో, బీహెచ్‌పీవీని బీహెచ్‌ఈఎల్‌లో విలీనం చేయించుకున్నాం. ఇలా ఎన్నో అంశాల్లో విజయం చరిత్ర మన ఉత్తరాంధ్రకు ఉంది. ఇప్పుడు స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’అని శర్మ అన్నారు. రాష్ట్రానికే కీలక పరిశ్రమ అయిన స్టీల్‌ప్లాంట్ రక్షించాల్సిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఇప్పుడు మోదీని నిలదీయడానికి సిద్ధంగా లేరని దుయ్యబట్టారు. స్టీల్‌ప్లాంట్, హామీల అంశాలు పక్కదారి పట్టించే విధంగా లడ్డూ సమస్యను ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. వీరు స్టీల్‌ప్లాంట్‌ను కాపాడలేకపోతే.. రాష్ట్రంలో ఏదీ సాధించలేరని మండిపడ్డారు. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించాలని, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జిల్లా కార్యదర్శి వై.సత్యవతి, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎం.ఎ.బేగం అధ్యక్షతన జరిగిన సభలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దామోదరరావు, ఎన్‌పీఆర్‌డీ జిల్లా కార్యదర్శి వెంకయ్య, పెన్షనర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.అప్పారావు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బి.పద్మ, కె.వనజాక్షి, జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు, వైస్ చైర్మన్ ఎం.మన్మథరావు తదితరులు మాట్లాడారు. సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.జె.అచ్యుతరావు, నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, పి.మణి, బి.జగన్, మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ, ఏపీ మహిళా సమాఖ్య నాయకులు అన్నపూర్ణ, దేవుడమ్మ, అరుణ, ఐద్వా జిల్లా నాయకులు కె.కుమారి, కె.మణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment