ఇళ్ల నిర్మాణాల్లో జోరు పెంచాలి
మహారాణిపేట: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రోజుకు 150 నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఇసుక సరఫరా, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో లే అవుట్ల వారీగా కలెక్టర్ సమీక్ష నిర్వహించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్దేశిత లక్ష్యాల మేరకు స్టేజ్ కన్వర్షన్ జరగాలని, నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు, లేఅవుట్ ఇన్‌చార్జి అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, క్షేత్ర స్థాయి అధికారులకు తగిన సహకారం అందించాలని సూచించారు. లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ, గుత్తేదార్లను అప్రమత్తం చేస్తూ పనుల్లో జోరు పెంచాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ ఆళ్ల శ్రీనివాసు, ఈఈ, డీఈలు, మండల ప్రత్యేక అధికారులు, ఏఈలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment