అయోమయం.. గందరగోళం!
● తేలని మున్సిపల్ టీచర్ల పదోన్నతుల లెక్క ● ఈ నెల 6, 8 తేదీల్లో ప్రమోషన్ల కౌన్సెలింగ్ ● ఇంకా బయటకు రాని తెలుగు, హిందీ సీనియారిటీ జాబితాలు ● ఖాళీల వివరాలు వెల్లడించని విద్యాశాఖాధికారులు ● ఎయిడెడ్ టీచర్ల సర్దుబాటుతో సమస్య జఠిలం
విశాఖ విద్య: పాఠశాల విద్యలోకి విలీనమైన తరువాత తొలిసారిగా జరుగుతున్న మున్సిపల్ టీచర్ల పదోన్నతుల ప్రక్రియ గందరగోళంగా మారుతోంది. జీవీఎంసీ పరిధిలోకి వచ్చే విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని మున్సిపల్ యాజమాన్య స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా, జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు అవలంభిస్తున్న విధానాలు వీరిని అయోమయానికి గురిచేస్తున్నాయి. మున్సిపల్ పరిధిలో అన్ని క్యాడర్లు కలిపి 449 ఖాళీలు ఉన్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ జీవీఎంసీ పరిధిలో క్యాడర్ల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎంతమందికి పదోన్నతులిస్తారనే స్పష్టత లేకపోవటంపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జాబితాల వెల్లడిలో జాప్యం
జీవీఎంసీ పరిధిలో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల సీనియార్టీ జాబితాలను అక్టోబర్ 28న ప్రకటించాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ, ఈ నెల 1న వీటిని వెల్లడించినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. అది కూడా కొన్ని సబ్జెక్టులకే. గ్రేడ్–2 హెచ్‌ఎం, పీఎస్ హెచ్‌ఎం, ఎస్‌ఏ గణితం, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ సైన్సు, సోషల్ సబ్జెక్టులకు మాత్రమే జాబితాలు విడుదల చేశారు. తెలుగు, హిందీ సబ్జెక్టులకు సంబంధించిన జాబితాలు ప్రకటించలేదు. సోమవారం నాటికి అభ్యంతరాలను స్వీకరించి, ఫైనల్ జాబితాలను ప్రకటించాల్సి ఉంది. దీనిపై సరైన సమాచారం లేకపోవటంతో తమ అభ్యంతరాలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు అంటున్నారు.
ఖాళీలపై స్పష్టత ఏదీ?
ఎయిడెడ్ స్కూళ్ల నుంచి ఇటీవల ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినప్పుడు, కొంతమందికి జీవీఎంసీ పరిధిలో పోస్టింగ్‌లు ఇచ్చారు. అప్పటి అధికారుల హయాంలో జరిగిన లోపాయికారీ ఒప్పందాలు ఇప్పుడు సమస్యగా మారినట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చసాగుతోంది. పోస్టుల సర్దుబాటు తరువాత క్యాడర్ స్టెరంత్‌ను సరిచేయకపోవటంతో, ప్రస్తుతం ఇచ్చే ప్రమోషన్లలో రోస్టర్ కేటాయింపు లెక్కతప్పింది. జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ సైతం ఇదే విషయాన్ని ఎత్తిచూపటంతో, ఖాళీల గుర్తింపు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. వాస్తవంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది తెలిస్తేనే, రోస్టర్ అమలు, డీఎస్సీకి ఎన్ని కేటాయించాలి, పదోన్నతుల్లో ఎన్ని భర్తీ చేయాలన్నది తేలుతుంది. దీనిపై స్పష్టత లేకపోవటంతో షెడ్యూల్ మేరకు పదోన్నతుల ప్రక్రియ ముందుకు సాగుతుందా? లేదా? అనే అనుమానాలను ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు.
పదోన్నతుల షెడ్యూల్
సీనియార్టీ జాబితా ప్రకటన అక్టోబర్ 28
అభ్యంతరాల స్వీకరణ నవంబర్ 4
గ్రేడ్–2 హెచ్‌ఎంల
కౌన్సెలింగ్ నవంబర్ 6
ఎస్‌ఏ/పీఎస్ హెచ్‌ఎంల
కౌన్సెలింగ్ నవంబర్ 8
Comments
Please login to add a commentAdd a comment