సముద్రంలో మునిగి యువకుడి మృతి
మృతుడు పెందుర్తి మండలం నాయుడు తోట వాసిగా గుర్తింపు
రాంబిల్లి(యలమంచిలి): ఈత సరదా యువకుడి ప్రాణం తీసింది. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన యువకుడు కెరటాలకు కొట్టుకుపోయి అందని తీరాలకు వెళ్లిపోయాడు. రాంబిల్లి సీఐ నర్సింగరావు, మృతుడు తండ్రి జగన్నాథరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెందుర్తి మండలం, నాయుడుతోట గ్రామానికి చెందిన శ్రీగుడి వెంకటసాయి అభిరామ్(21) ఆదివారం తెల్లవారు జామున నలుగురు స్నేహితులతో కలసి ద్విచక్ర వాహనాలపై రాంబిల్లి మండలం సీతపాలెం సముద్ర తీరానికి వెళ్లారు. ఉదయం 6 గంటలకు సముద్రంలో సరదాగా స్నానానికి దిగి ఈత కొడుతూ ఉల్లాసంగా గుడిపారు.
ఉదయం 7.30 గంటల సమయంలో కొంత అలసటకు గురైన అభిరామ్ సముద్రంలో ఉన్న రాయి మీదకు ఎక్కి సేదతీరుతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా ఒక పెద్ద కెరటం రావడంతో సముద్రంలో పడిపోయాడు. అలల తాకిడికి లోపలికి కొట్టుకుపోతుండగా గమనించిన ముగ్గురు స్నేహితులు స్థానిక మత్స్యకారులకు సమాచారం అందించారు. వారు బోటు సహాయంతో అపస్మారక స్థితిలో ఉన్న అభిరామ్‌ను రక్షించారు. కొన ఊపిరితో ఉన్న అభిరామ్‌ను స్నేహితులు తమ ద్విచక్ర వాహనాల మీద అచ్యుతాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అభిరామ్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు, బంధువులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. అభిరామ్ ఇటీవల బీటెక్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడని, కొద్ది రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉందని రోదించారు. ఒక్కగానొక్క కుమారుడు ఇలా సముద్రంలో అలల తాకిడికి కొట్టుకుపోయి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు విషాదంలో మునిగిపోయారు.
జగన్నాథరావు ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ కుమారుడు అభిరామ్‌ను అల్లారుముద్దుగా పెంచి బీటెక్ వరకు చదివించారు. అంది వచ్చిన ఏకై క కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడంతో ఆస్పత్రిలో ఆవరణలో ఆయన కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలచివేసింది. జగన్నాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాంబిల్లి సీఐ సీహెచ్.నర్సింగరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment