పేదల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
మహారాణిపేట: సామాన్యులు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రోత్సహించాలని ఎంపీ శ్రీభరత్ అన్నారు. కేంద్ర పథకాలు అర్హులకు అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాల తీరు తెన్నులు, సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లు, అధికారుల సమన్వయం తదితర అంశాలపై కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం జరిగిన దిశా (డిస్ట్రిక్ట్ డెవెలప్‌మెంట్ కో–ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ/జిల్లాస్థాయి అభివృద్ధి సమన్వయ మానటరింగ్ కమిటీ) సమావేశంలో 20 సూత్రాల కార్యక్రమ అమలు చైర్మన్ లంకా దినకర్‌తో కలిసి ఆయన వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ క్రమంలో 31 విభాగాల పరిధిలో కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, కేంద్ర పథకాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అమలుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, అధిక పని దినాలు కల్పించి, పూర్తి వేతనాలు అందించాలన్నారు. అర్హులకు సామాజిక పింఛన్లు అందించాలని, అనర్హుల గుర్తింపులో శాసీ్త్రయ విధానాలను అవలంభించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనర్హుల పింఛన్లు గుర్తించే క్రమంలో అధికారులు జాగ్రత్త వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. సామాజిక పింఛన్ల అంశంపై జరిగిన సమీక్షలో భాగంగా వారందరూ ఈ మేరకు వారి అభిప్రాయాలను వెల్లడించారు. వైద్యారోగ్య శాఖ ద్వారా అందే పింఛన్లు పొందేందుకు కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించారని అలాంటి వారిని గుర్తించి నివేదించాలని సూచించారు. ఒంటరి మహిళల విషయంలో కాస్తసడలింపులు ఇస్తూ పింఛన్లు అందజేయాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మరుగుజ్జులకు, క్యాన్సర్ బాధితులకు పింఛన్లు అందించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించాలని ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సూచించారు. సమావేశంలో ఆయిల్ – సీడ్స్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి, సీపీవో శ్రీనివాసరావు, డ్వామా పీడీ పూర్ణిమ, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
దిశ కమిటీ సమీక్షలో ఎంపీ శ్రీభరత్
Comments
Please login to add a commentAdd a comment