ప్రభుత్వ నిర్మాణాల్లో ఆర్కిటెక్ట్‌ల భాగస్వామ్యం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో చేపడుతున్న ప్రభుత్వ పరమైన భవన నిర్మాణాల్లో ఆర్కిటెక్ట్‌లను భాగస్వాములుగా చేయాలని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్(ఐఐఏ) విశాఖపట్నం సెంటర్ చైర్మన్ రాజేష్ నాగుల విజ్ఞప్తి చేశారు. అమరావతిలోని డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) అదనపు డైరెక్టర్ బి.శ్రీనివాసుల్ని ఏపీ ఆర్కిటెక్ట్‌ల బృందం సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భవన నిర్మాణాలపై త్వరలో రానున్న ప్రభుత్వ ఉత్తర్వుల ముసాయిదాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు, అభ్యర్థనలను సమర్పించారు. రాష్ట్రంలో సమాంతర అభివృద్ధి కోసం ఆర్కిటెక్ట్‌ల పాత్రను తప్పనిసరి చేయాలంటే గ్రూప్ హౌసింగ్, పారిశ్రామిక సముదాయాలు, హాస్పిటల్స్, పర్యాటక అభివృద్ధి వంటి నిర్మాణాల అనుమతుల ప్రక్రియలో ఆర్కిటెక్ట్‌లను భాగస్తులను చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. 500 చ.మీటర్లు పైబడిన ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి, వాటి భద్రత, నాణ్యత, డిజైన్ సమగ్రతల దృష్ట్యా ఆర్కిటెక్ట్‌ల ప్రమేయం తప్పనిసరి చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీటీసీపీ.. ఆర్కిటెక్ట్‌ల సూచనలు, సలహాల్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఏకీకృత రిజిస్ట్రేషన్ విధానంతో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్(సీవోఏ) రిజిస్ట్రేషన్ స్టేటస్‌తో అనుసంధానించిన ఎలాంటి ఇబ్బందుల్లేని లాగిన్ వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు రాజేష్ తెలిపారు.
డీటీసీపీకి ఐఐఏ విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment