ఆ పాపాయిల విషయంలో జాగ్రత్తలు అవసరం
ప్రపంచ ప్రీమెచ్యూరిటీ డే కార్యక్రమంలో కలెక్టర్ సూచన
సీతంపేట: నెలలు నిండకుండా జన్మించిన శిశువుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులకు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సూచించారు. మెడికవర్ వుమెన్ అండ్ చైల్డ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో పోర్టు స్టేడియంలోని బ్యాంకెట్ హాల్లో రఆదివారం ప్రపంచ ప్రీమెచ్యూరిటీ డే జరిగింది. వీఎంఆర్డీఏ చైర్మన్ కె.ఎస్.విశ్వనాథన్‌తో కలిసి కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రీమెచ్యూర్ శిశువులు ఎదిగే క్రమంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఆస్పత్రి నియోనాటాలజిస్ట్ సాయి సునీల్ కిశోర్ మాట్లాడుతూ 23 నుంచి 37 వారాల మధ్య పుట్టే శిశువులను ప్రీమెచ్యూర్ పిల్లలుగా పరిగణిస్తారన్నారు. వీరు ఎదిగే క్రమంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు లోనవుతారన్నారు. ఎక్స్‌ట్రీమ్ ప్రీమెచ్యూర్ పిల్లల్లో సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయని, శిశువు లోపల అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందవన్నారు. అటువంటి శిశువు సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. నెలలు నిండకుండా పుట్టే పిల్లలు తల్లి పాలు తాగలేరని, శ్వాసకోస సమస్యలు, న్యూట్రిషనల్ ఇన్‌ఫెక్షన్స్, షుగర్ లెవెల్స్‌లో హెచ్చు తగ్గులు వంటి సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. ఇటువంటి పిల్లలను ఇంక్యుబేటర్‌లో ఉంచి వెంటిలేటర్ సహాయంతో వైద్యం అందించాల్సి ఉంటుందన్నారు. వైద్యులు విద్యారమ, గీత వందన, భూలక్ష్మి, రాధిక, విజయ్, మౌనిక, సెంటర్ హెడ్ శ్యామల, ప్రీమెచ్యూర్ పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment