జనవరి 1 నుంచి ప్లాస్టిక్ నిషేధం
● రూ.500 కోట్లతో ఐదేళ్లలో రోడ్ల అభివృద్ధి ● జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ వెల్లడి
డాబాగార్డెన్స్: వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి నగరంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ స్పష్టం చేశారు. ఇప్పటికే దుకాణదారులతో మాట్లాడామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వారికి సూచించినట్లు చెప్పారు. ప్లాస్టిక్ నిషేధంపై నగర పౌరులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీవీఎంసీలోని తన చాంబర్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.500 కోట్లతో ఐదేళ్లలో నగర పరిధిలో రోడ్లన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి జంక్షన్‌లో సీసీ కెమెరాలు, వీధి దీపాలు పక్కాగా వెలిగేలా, రోడ్లకిరువైపులా గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్, తిరువనంతపురం తరహాలో ఈ ప్రాజెక్ట్ చేపడతామని, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. జీవీఎంసీ పరిధిలో ఎంపిక చేసిన 15 రోడ్ల మీదుగా హైవేకు సులువుగా వెళ్లేలా ప్రణాళిక రూపొందించినట్టు వివరించారు.
రూ.295 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు
జీవీఎంసీ పరిధిలో ప్రతి రోజూ 460 ఎంఎల్‌డీ నీరు అవసరం కాగా.. పంపింగ్‌లో లోపం కారణంగా 400 ఎంఎల్‌డీ నీటినే సరఫరా చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇందులో 90 ఎంఎల్‌డీ నీటిని పరిశ్రమలకు, 310 ఎంఎల్‌డీ నీటిని ప్రజావసరాలకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. 68 శాతం నీరు ఏలేరు కాలువ నుంచి, 32 శాతం మిగిలిన రిజర్వాయర్ల నుంచి వస్తోందన్నారు. రూ.295 కోట్లతో కొత్తగా తాగునీటి ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు వెల్లడించారు. కణితి రిజర్వాయర్ నుంచి నరవ కొండకు, అక్కడి నుంచి నేరుగా ముడసర్లోవకు వెళ్లేటట్టు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇందుకు సంబంధించి నిధుల కోసం ఐఎఫ్‌ఎస్‌తో చర్చించినట్లు వెల్లడించారు. జీవీఎంసీ పరిధిలో 5.79 లక్షల అసెస్‌మెంట్స్ ఉన్నప్పటికీ 3.5 లక్షల అసెస్‌మెంట్స్‌కే మంచినీటి కనెక్షన్లు ఉన్నాయని, 95 వేల అసెస్‌మెంట్స్ వారు కనెక్షన్లు వద్దంటున్నారని చెప్పారు. పాత పైపులు మరమ్మతులు చేపట్టేందుకు అసెస్‌మెంట్‌దారులు ముందుకు రావాలన్నారు. మురళీనగర్ తదితర ప్రాంతాల్లో 24 గంటల మంచినీటి సరఫరా చేస్తున్నామని, అన్ని జోన్లలో 24/7 మంచి నీరు సరఫరా చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చవుతుందన్నారు. వచ్చే ఏడాది కాలంలో పబ్లిక్ కుళాయిలను తొలగిస్తామన్నారు.
రూ.550 కోట్లతో యూజీడీ ప్రాజెక్టు..
జీవీఎంసీ పరిధి జోన్–3, 4, 5లో ఇప్పటికే భూగర్భ డ్రైనేజీ అమలవుతోందని, జోన్–6, 8లో కొంత మేర పనులు జరిగాయన్నారు. జోన్–1 భీమిలి, జోన్–7 అనకాపల్లిని మినహాయించి జోన్–2లో భూగర్భ డ్రైనేజీ పనులు త్వరితగతిన చేపట్టేందుకు ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేశామన్నారు. రూ.550 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు జీవీఎంసీ రూ.9 కోట్లు, అమృత పథకం కింద రూ.45 కోట్లు రానుండగా మిగిలిన మొత్తాన్ని ఐఎఫ్‌ఎస్‌సీ అందజేస్తుందన్నారు. భూగర్భ డ్రైనేజీ అమలవుతున్న ప్రాంతాల్లో 45 శాతం కనెక్షన్లు తీసుకోలేదని, వారందరూ త్వరలో కనెక్షన్లు తీసుకోవాలని సూచించారు. అప్పుఘర్ వద్ద ఉన్న ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఆధునికీకరిస్తామన్నారు. సిటీ పరిధిలో 149 చీకటి ప్రాంతాలుగా గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో పోలీస్ శాఖ నైట్ పెట్రోలింగ్‌తో పాటు నిఘా ఏర్పాటు చేసిందన్నారు. జీవీఎంసీ పరిధిలో 1.18 లక్షల వీధిలైట్లు ఉన్నాయని, చాలా చోట్ల వెలగడం లేదన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో ఈ విషయాన్ని గమనించానని, దీపాలన్నీ పక్కాగా వెలిగేలా చర్యలు చేపట్టినట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment