● సింహాచలం భూముల అక్రమాలకు గతంలోనే విచారణ ● తాజాగా సందేహాల నివృత్తి పేరిట విచారణాధికారులకు పిలుపు
ఈవో రామచంద్రమోహన్‌ను కాపాడేందుకేనా?
మహారాణిపేట: సింహాచలం భూములను నిషేధిత జాబితా నుంచి నిబంధనలకు విరుద్ధంగా తొలగించారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న దేవదాయశాఖ అదనపు కమిషనర్ కె.రామచంద్రమోహన్‌ను కాపాడేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై గతంలోనే విచారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అధికారులు.. ఇప్పుడు తమ ముందు హాజరుకావాలని విజిలెన్స్ లేఖ రాయడం అనేక ఊహాగానాలకు దారితీసింది. ఇప్పటికే అధికారులు అందించిన నివేదిక ప్రభుత్వం వద్దే ఉన్నప్పటికీ.. మళ్లీ దానిపై ప్రత్యేకంగా వివరాలు తెలుసుకోవాలనుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం అన్నవరం కార్యనిర్వహణాధికారి(ఈవో)గా దేవదాయ శాఖ అడిషినల్ కమిషనర్ రామచంద్రమోహన్ విధులు నిర్వర్తిస్తున్నారు. 2007–2008లో విశాఖలో డిప్యూటీ కమిషనర్‌గా ఉంటూ సింహాచలం ఇన్‌చార్జి ఈవోగా వ్యవహరించారు. మళ్లీ 2013 మార్చి నుంచి 2019 ఆగస్టు వరకు ఆరేళ్ల పాటు సింహాచలం ఈవోగా విధులు నిర్వర్తించారు.
భూముల అన్యాక్రాంతంపై ఆరోపణలు
2016 డిసె.ంబర్ నుంచి 2017 ఫిబ్రవరి మధ్య సింహాచలం దేవస్థానానికి చెందిన 862 ఎకరాల భూములను రిజిస్టర్ నుంచి తొలగించారని రామచంద్రమోహన్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే మాన్సాస్ భూముల విషయంలో కూడా అక్రమాలు జరిగినట్లు వార్తలు వినిపించాయి. దీనిపై గత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందుకోసం అసిస్టెంట్ అడిషనల్ కమిషనర్ టి.చంద్రకుమార్, జాయింట్ కమిషనర్ డి.భ్రమరాంబ, డిప్యూటీ కమిషనర్(వీఆర్) ఈ.వి.పుష్పవర్ధన్‌లతో కమిటీని నియమించింది. ఈ ఆరోపణలపై కమిటీ విచారించి 2021 జూలై 16న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రామచంద్రమోహన్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేల్చింది. దీంతో ప్రభుత్వం అతనిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పూర్తిస్థాయి వాస్తవాల కోసం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత రామచంద్రమోహన్ కోర్టుకు వెళ్లి తిరిగి పోస్టింగ్ తెచ్చుకున్నారు.
విచారణాధికారులను పిలిచిన విజిలెన్స్
కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలల తర్వాత విజిలెన్స్ అధికారులు ఇప్పుడు రాసిన ‘లేఖ’అనేక సందేహాలకు తావిస్తోంది. ఆరోపణలపై సందేహాల నివృత్తి పేరుతో గతంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విచారణాధికారులను ప్రశ్నించాలని నిర్ణయించారు. ఇందు కోసం ఈ నెల 22లోగా అసిస్టెంట్ అడిషనల్ కమిషనర్ టి.చంద్రకుమార్, జాయింట్ కమిషనర్ డి.భ్రమరాంబ, డిప్యూటీ కమిషనర్(వీఆర్) ఈ.వి.పుష్పవర్ధన్‌లు తమ ముందు హాజరుకావాలని దేవదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ నిర్ణయించడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింహాచలం భూముల అక్రమాలను పక్కనపెట్టి.. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏమైనా ఒత్తిళ్లు చేశారా? రామచంద్రమోహన్‌కు వ్యతిరేకంగా నివేదిక రావడానికి కారణాలేంటి? తదితర విషయాలపై ఆరా తీసే అవకాశాలు ఉన్నట్లు ఆ శాఖలోనే చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment