ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌పై ఈనెల 23న ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించింది. మంగళవారం రాత్రి జరిగిన పోరాట కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 24న స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు పాదయాత్ర నిర్వహించి అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. 27న సెయిల్‌లో విలీనం అనే అంశంపై ఉత్తరాంధ్ర మేధావులతో విశాఖలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వస్తున్న నేపథ్యంలో ఈనెల 28న ఉదయం 8 నుంచి 29 రాత్రి 6 గంటల వరకు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. సమావేశంలో పోరాట కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, కె.ఎస్.ఎన్. రావు, జె.అయోధ్యరామ్, యు. రామస్వామి, రామ్మోహన్‌కుమార్, లక్ష్మణరావు, సన్యాసిరావు, రామ్‌కుమార్, వరసాల శ్రీనివాసరావు, బి.డేవిడ్, పల్లా పెంటారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment