సాక్షి, విశాఖపట్నం : యావత్ ప్రపంచానికి దేశ రక్షణ శక్తిని చాటిచెప్పేలా సమర సన్నద్ధ ప్రదర్శన (సీవిజిల్–2024) దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. భారత నౌకాదళం, తీరగస్తీ దళం, మైరెన్ పోలీస్ వ్యవస్థలు ఉగ్రవాదులకు సవాల్ విసురుతూ.. తీర ప్రాంతంపై భారత రక్షణ దళ పట్టును ప్రదర్శించేందుకు 2018 నుంచి ఏటా రెండు రోజుల పాటు ‘సీ విజిల్’ పేరుతో విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
సీవిజిల్–2024 యుద్ధ విన్యాసాల్లో భాగంగా తొలిరోజున సముద్ర తీర రేఖ కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, పుదుచ్చేరి సహా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 7,516.6 కిలోమీటర్ల పొడవునా సమర సన్నద్ధ ప్రదర్శన నిర్వహించారు. రక్షణ మంత్రిత్వ శాఖ, హోం, షిప్పింగ్, పెట్రోలియం, సహజ వాయువులు, కస్టమ్స్, మత్స్యశాఖ, పశు సంవర్థక శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు ఈ విన్యాసాల్లో భాగస్వామ్యమయ్యాయి.
అంతర్రాష్ట్ర ఏజెన్సీల సమన్వయం, సమాచార భాగస్వామ్యం, సాంకేతిక పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించి ఔరా అనిపించేలా తీర రక్షణ శక్తిని ప్రపంచానికి చెప్పారు. నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందిన 50 నౌకలతోపాటు 100 పెట్రోలింగ్ బోట్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. వీటితో పాటుగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, సబ్‌మైరెన్‌లు.. ఇలా మొత్తం 500 వరకు ఈ విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. విశాఖ సహా ప్రతి తీరానికి ఐదు మైళ్ల దూరం వరకూ నిఘా వ్యవస్థను పటిష్టం చేసి మాక్ డ్రిల్ తొలి రోజున నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment