విషవాయువు లీక్‌తో ఉలికిపాటు
● ఠాగూర్ ఫార్మా ప్రమాదంలో ఒకరి మృతి ● ఇద్దరి పరిస్థితి విషమం ● మెడికవర్‌లో మరో ఆరుగురికి చికిత్స ● బాధితులను పరామర్శించిన కలెక్టర్, ఎస్పీ, మాజీ మంత్రి అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం/అక్కిరెడ్డిపాలెం: పరవాడ జేఎన్ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీ యూనిట్–3లో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు జరిగిన ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంపెనీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం లీకై న ఘటనలో 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. క్షతగాత్రులకు కంపెనీలోనే సపర్యలు చేసి బుధవారం ఉదయం 6 గంటలకు వడ్లపూడిలోని పవన్‌సాయి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒడిశా రాష్ట్రం, బాలానగర్ జిల్లా, బగ్‌దూర్ గ్రామానికి చెందిన హెల్పర్ అమిత్ బాగ్ (23) బుధవారం మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో మృతి చెందాడు. కెమిస్ట్‌గా పనిచేస్తున్న అగనంపూడికి చెందిన చిన్ని కృష్ణ (44), జూనియర్ మేనేజర్ (వేర్‌హౌస్)గా పనిచేస్తున్న పరవాడలో ఫార్మసీ కాలనీకి చెందిన వీరశేఖర్ (34) పరిస్థితి విషమంగా ఉంది. మిగతా ఆరుగురు కార్మికులు వీరబాబు, రాజారావు, పాపారావు, అనిల్‌కుమార్, విజయభాస్కర్, శరత్‌కుమార్‌లను నగరంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి నిలకడగా ఉంది. కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పరామర్శించారు. చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఠాగూర్ ఫార్మా కంపెనీలో పనిచేసే కార్మికుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంపెనీలో పనిచేస్తున్న 236 మంది కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై స్వయంగా కలెక్టర్ విజయకృష్ణన్ పర్యవేక్షిస్తూ తెలుసుకుంటున్నారు. కార్మికులకు స్వయంగా కలెక్టర్ ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తక్షణమే వైద్య సదుపాయం అందించుటకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment