పరిశ్రమల్లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పరవాడ, అచ్యుతాపురం సెజ్ పరిధిలో వరుస ప్రమాదాలు, పెద్ద సంఖ్యలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఫార్మా కంపెనీలంటేనే కార్మికుల కుటుంబాలు భయంతో వణికిపోతున్నాయి. ఐదున్నర నెలల వ్యవధిలో వివిధ ప్రమాదాల్లో 27 మంది కార్మికులు మృతి చెందారు. 80 మందికి పైగా అస్వస్థతకు లోనయ్యారు. పరిశ్రమల్లో మరణ మృదంగంపై కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై కార్మిక వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆగస్టు నెలలో అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో, పరవాడ సెజ్‌లోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ యూనిట్–3లో జరిగిన ప్రమాదాల్లో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఆ పీడ కలలను మరువక ముందే పరవాడలోని ఠాగూర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో విషవాయువులు (హెచ్‌సీఎల్) లీకై ఒడిశాకు చెందిన అభిజిత్ దాస్ అనే కార్మికుడు మృతి చెందారు. మరో 8 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment