ఫార్మా పరిశ్రమల్లో విధులకు వెళ్లిన కార్మికులు క్షేమంగా ఇళ్లకు తిరిగి వస్తారన్న ధీమా ఉండడం లేదు. వారు ఇంటికి చేరే వరకు కుటుంబ సభ్యులు టెన్షన్‌తో ఎదురుచూసే దుస్థితి ఏర్పడింది. పరవాడ– అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్ పరిధిలో పలు రసాయన పరిశ్రమల్లో కనీస రక్షణ చర్యలు కూడా లేకపోవడం, సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం, పరిశ్రమలో శిక్షణ గల ఫైర్ సిబ్బంది లేకపోవడంతోనే అధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా రియాక్టర్లు బాంబుల్లా పేలుతున్నాయి. ఇక్కడ కనీస అవగాహన లేని టెంపరరీ, కాంట్రాక్ట్ కార్మికుల చేత పనులు చేయిస్తున్నారు. వారు రియాక్టర్ల ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించకపోవడం, కెమికల్ రియాక్షన్‌ను నివారించడంలో విఫలం కావడంతో పేలుళ్లు జరుగుతున్నాయి. ఇక ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమ వర్గాలు చికిత్స కోసం క్షతగాత్రులను తరలించకపోవడంతో పాటు కొన్నిసార్లు వారు ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. విధులు నిర్వహించే వారిలో అధికంగా స్థానికేతరులే ఉండడంతో వారి తరఫున పరిశ్రమలపై పోరాటం చేసే వారు లేక కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే స్థానికుల కంటే స్థానికేతరులనే ఎక్కువగా తీసుకోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రశ్నించే వారే లేకుండా పోతున్నారు. చాలా పరిశ్రమల్లో సరైన అంబులెన్స్ లాంటి వాహన సౌకర్యాలు, వారి పరిశ్రమల్లోనే వైద్య సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం జరిగి అక్కడ నుంచి నగరానికి చేరే లోపు కార్మికులు మృత్యువాత పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment