బాబూ.. ఇదేం బాదుడు?
● సంపద సృష్టించడమంటే ప్రజలపై భారం వేయడమా? ● స్మార్ట్ మీటర్లను పగలగొట్టండన్న లోకేష్ వ్యాఖ్యలు మర్చిపోగలమా.. ● విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్‌మీటర్లపై ప్రభుత్వం పునరాలోచించాలి ● రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, సామాజిక వేత్తల డిమాండ్
సాక్షి, విశాఖపట్నం: ‘ఎన్నికల్లో విద్యుత్ చార్జీలు తగ్గిస్తానన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపారు. సంపద సృష్టించడమంటే ఇదేనా? ప్రజలపై సర్దుబాటు చార్జీల పేరిట వడ్డించడమా? విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే దురదృష్టకరమైన బషీర్‌బాగ్ వంటి ఘటనలు పునరావృతం కాక తప్పదు’అని పలువురు మేధావులు, సామాజిక వేత్తలు హెచ్చరించారు. ద్వారకానగర్‌లోని పబ్లిక్ లైబ్రరీలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.వి.ఆర్ కృష్ణంరాజు ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వినియోగదారులపై సర్దుబాటు చార్జీల కింద వసూళ్లు చేస్తున్న మొత్తం రూ.17,898 కోట్ల ను ప్రభుత్వమే భరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు చార్జీలు తగ్గించాలని, సామా న్య ప్రజలకు అనుకూలమైన పాలన, విధానాలు అమలు చేయాలని, స్మార్ట్ ఎనర్జీ మీటర్ల ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలనే తీర్మానాలను కృష్ణంరాజు ప్రవేశపెట్టగా.. అందరూ ఆమోదించారు.
చార్జీల పెంపుతో ప్రజలపై పెనుభారం
ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ, ‘విద్యుత్ చార్జీల పెంపుతో గృహ వినియోగదారులు, రైతులపై పెనుభారం పడుతోంది. సర్దుబాటు చార్జీల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై సుమారు రూ.17,898 కోట్ల భారం మోపడం దారుణం. సగటున యూనిట్‌కు రూ.15 వరకు వినియోగదారుడు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం.’అని తెలిపారు. ఏయూ విశ్రాంత ప్రొఫెసర్ తమ్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలకు విరుద్ధంగా ప్రభుత్వాలు పాలన చేస్తే ప్రజలు క్షమించరన్నారు. విద్యుత్ చార్జీలు పెంచడం ద్వారా అన్ని రంగాలపై దాని ప్రభావం ఉంటుందన్నారు. స్మార్ట్ మీటర్ల పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాయని ఆరోపించారు. సీఐటీయూ నాయకురా లు మణి మాట్లాడుతూ ఎక్కువ వినియోగం ఉన్న సమయంలో పీక్ ఆఫ్ టైం పేరిట చార్జీలు వసూళ్లు చేస్తారని చెప్పడం దారుణమన్నారు. సర్దుబాటు చార్జీలు తగ్గించి..అదానీతో స్మార్ట్‌మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించాలని, అవసరమైతే పగలగొట్టండని ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్ ఇచ్చిన పిలుపును ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు.
దోపిడీలో చంద్రబాబుకు 40 ఏళ్ల అనుభవం
సీపీఎం నేత గంగారావు మాట్లాడుతూ దేశంలో ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే ట్రూ అప్ చార్జీల పేరిట వసూళ్లు చేస్తు న్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేట్ చేతుల్లో పెట్టే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జె.టి.రామారావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పుకునే పవన్ కల్యాణ్ లాంటి వారు విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడటం లేదన్నారు. ఆరు నెలల పాలనలో విద్యుత్ చార్జీలు, నిత్యావసర ధరలు భారీగా పెరిగినప్పటికీ.. ఆ ఊసే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైల్వే యూనియన్ నాయకుడు రామచంద్రమూర్తి మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు దోపిడీలో 40 ఏళ్ల అనుభవం ఉందని ఆరోపించారు. వినియోగదారుడు రోడెక్కి ప్రశ్నించిన రోజే ఈ ప్రభుత్వంలో మార్పు వస్తుందన్నారు. సామాజిక కార్యకర్త సన్ మూర్తి మాట్లాడుతూ సామాన్యుడికి వచ్చే ఆదాయంలో సగం విద్యుత్ చార్జీలకే చెల్లిస్తే.. ఆ కుటుంబ పోషణ ఎలా గడుస్తుందని ప్రశ్నించారు. స్వచ్ఛంద సంస్థ అధినేత వై.నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ‘బాదుడే బాదుడు’పేరిట ఆందోళనలు చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌మీటర్లు బిగిస్తున్నారని.. రైతులు ఎలా వ్యవసాయం చేయాలని ప్రశ్నించారు. వ్యాపారవేత్త జి.త్యాగరాజు మాట్లాడు తూ వినియోగదారుడు వాడని విద్యుత్‌కూ బిల్లు చెల్లించాల్సి వస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment