సీతంపేట: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2025 జనవరి ఒకటో తేదీ నుంచి జిల్లాలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మార్కెట్ విలువలు సవరిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ మాయూర్ అశోక్ తెలిపారు. మార్కెట్ విలువలు సవరించే ప్రక్రియలో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ డీఐజీ జి.బాలకృష్ణ, జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్రరావు, తహసీల్దార్లు, జోనల్ కమిషనర్లు, ఆర్‌ఐలు పాల్గొని.. 3 నెలల నుంచి వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి మార్కెట్ విలువను ఎంతమేరకు సవరించాలనే ప్రాథమిక అంగీకారానికి వచ్చారు. దీని ప్రకారం మార్కెట్ విలువల సవరణ జాబితాను తయారు చేసి రానున్న రెండు రోజుల్లో సంబంధిత కమిటీల ఆమోదానికి పంపనున్నారు. ఆ తర్వాత సవరణ జాబితాలను ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని సమావేశంలో నిర్ణయించారు. ఆమోదించే మార్కెట్ విలువలు జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment