ఓటరు జాబితా సవరణలో అప్రమత్తం
మహారాణిపేట: ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకుడు ప్రవీణ్ కుమార్ సూచించారు. గురువారం విశాఖ విచ్చేసిన ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఓటరు జాబితా సంక్షిప్త సవరణ –2025పై సమీక్షించారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. స్థానికంగా ఉన్న జనాభాకు, ఓటర్లకు మధ్యనున్న వ్యత్యాసానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులకు నిర్ణీత సమయంలో పరిష్కారం చూపాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులను భాగస్వామ్యం చేసుకుంటూ వారి సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాలను పరిశోధించి జనాభా నిష్పత్తికి, ఓటరు నిష్పత్తికి భారీ వ్యత్యాసం వచ్చినట్లయితే క్షేత్రస్థాయి పర్యటన చేసి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో భాగంగా జిల్లాలో చేపట్టిన చర్యలను కలెక్టర్ హరేందిర ప్రసాద్ వివరించారు. అక్టోబర్ 29న ప్రచురించిన డ్రాఫ్ట్ ప్రకారం జిల్లాలో 20,14,236 మంది ఓటర్లు ఉన్నారని, జెండర్ రేషియో 1027 ఉందని పేర్కొన్నారు. అక్టోబర్ 29 తర్వాత 4,275 అభ్యంతరాలు రాగా 3,855 పరిష్కరించామని, ఇంకా 420 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సమావేశానికి హాజరైన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పలు అంశాలను ఎన్నికల జాబితా పరిశీలకుని దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఓటర్ల జాబితాలో తప్పిదాలు జరిగాయని, బోగస్ ఓట్లను స్వయంగా పరిశీలించి గుర్తించి, అధికారులకు నివేదించామని గుర్తు చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా అధికారుల సమీక్షలో రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకుడు ప్రవీణ్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment