రైతుబజార్లలో బది‘లీల’లు..!
● 11 రైతుబజార్ల ఈవోలకు స్థానచలనం ● బదిలీ ఉత్తర్వులపై అంతా గోప్యత
విశాఖ విద్య: జిల్లాలో రైతుబజార్ల సిబ్బంది బదిలీలకు వాణిజ్య, మార్కెటింగ్‌శాఖ అధికారులు తెరలేపారు. ఎస్టేట్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం పొద్దుపోయాక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సంబంధిత శాఖ అధికారులు గోప్యత పాటిస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలో మొత్తం 13 రైతుబజార్లు ఉండగా, వీటిలో 11 చోట్ల ఎస్టేట్ అధికారులకు స్థానచలనం కలిగిస్తూ, ఉత్తర్వులు వెలువడినట్లు ప్రచారం జరుగుతోంది. బదిలీలకు సంబంధించిన సమాచారం కొంతమంది ఎస్టేట్ అధికారులకు వాట్సప్ ద్వారా చేరటంతో, సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎవరెవరికి బదిలీ అయింది..? ఎక్కడకి బదిలీ అయిందనే దానిపై ఎస్టేట్ అధికారులు హైరానా పడ్డారు. పెందుర్తి, ములగాడ ఎస్టేట్ అధికారులు అక్కడ విధుల్లో చేరి రెండేళ్లు పూర్తికాకపోవటంతో వారిని బదిలీల నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది. మిగతా రైతుబజార్ల ఎస్టేట్ అధికారులను బదిలీ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే బదిలీల వ్యవ హారంపై తీవ్ర ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు వద్దని, కొంతమంది సిబ్బంది ఉన్నతాధికారులకు విన్నవించినా, ఇవేమీ పట్టించుకోకుండా బదిలీలపై ముందుకెళ్లటం గమనార్హం. ఇదిలా ఉండగా,ఈవోల బదిలీల్లో పెద్ద ఎత్తున పైరవీలు చోటుచేసుకున్నాయని, కూటమి నేతల సిఫార్సులకు పెద్దపీట వేశారన్న ప్రచారం ఉంది. వాస్తవంగా అయితే చిన్న రైతు బజార్లులో పనిచేసిన ఎస్టేట్ అధికారులను, ఈ దపా పెద్ద రైతు బజార్లుకు బదిలీ చేయాల్సి ఉంది. కానీ పెద్ద రైతుబజార్లులో పనిచేసిన కొంతమంది. తిరిగి అదే స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు సాగే రైతు బజార్లకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. శివారు ప్రాంతాల్లోని రైతు బజార్లుకు బదిలీ అయిన కొంతమంది ఎస్టేట్ అధికారులు దీని పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చే సేందుకు సిద్ధమౌతు న్నట్లు సమాచారం బదిలీ ఉత్తర్వులను శుక్రవారం నాడు ఎస్టేట్ అధికారులకు పంపించి, వెంటనే రిలీవ్ అయ్యేలా వాణిజ్య మార్కెటింగ్ శాఖ అధికారులు అంతా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment