తెలుగు వెలుగు చిన్నయ్య సూరి
● రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్
సీతంపేట: తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనం పరవస్తు చిన్నయ్య సూరి అని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పరవస్తు పద్యపీఠం ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో శుక్రవారం ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా పరవస్తు చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పేరి రవికుమార్‌కు ‘చిన్నయ్య సూరి’పురస్కారం ప్రదానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తమిళ భాషకు కచ్చితమైన డాక్యుమెంటేషన్ ప్రదర్శించడం వల్ల ప్రాచీన హోదా లభించిందని, ఆ విధంగా సమగ్రమైన విధానంతో మనం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ఉత్సవాలు నిర్వహిస్తామని, త్వరలో తేదీలను ప్రకటిస్తామన్నారు. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో కొన్ని గ్రంథాలు, పాఠాలు చెప్పే అధ్యాపకులు లేక ఆయా శాఖలను మూసివేస్తున్నా రని విచారం వ్యక్తం చేశారు. పురస్కార గ్రహీత పేరి రవికుమార్,పద్య పీఠం వ్యవస్థాపకుడు ఫణిశయన సూరి, ఆర్‌వీఆర్ ప్రాజెక్ట్స్ అధినేత ఆర్.వెంకటేశ్వరరావు, విజయ్ నిర్మాణ్ కంపెనీ అధినేత ఎస్.విజయకుమార్, విశ్రాంత ఆచార్యులు కందాల కనకమహాలక్ష్మి, స్టీల్‌ప్లాంట్ విశ్రాంత జీఎం తిరుపతి రాజమన్నార్, ఏయూ తెలుగు విభాగం విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment