విశాఖ సిటీ: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలకు నాలుగు రోజుల పాటు అంతరాయం కలుగుతుందని ఏపీజీవీబీ విశాఖ రీజినల్ మేనేజర్ చిరంజీవి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న బ్యాంక్ విభజనలో భాగంగా ఈ అంతరాయం ఏర్పడుతున్నట్లు వెల్లడించారు. ఈ నాలుగు రోజులు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కార్యకలాపాలు విభజించడం జరుగుతుందని తెలిపారు. దీంతో ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బ్యాంక్ సేవలు, ఏటీఎం, ఆన్‌లైన్ నగదు లావాదేవీలతో పాటు ఇతర బ్యాంక్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని వివరించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి తిరిగి యథావిధిగా బ్యాంక్ సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
నేడు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ రాక
మహారాణిపేట: కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘావల్ శనివారం విశాఖ వస్తున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో సాయంత్రం 5.20 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు నోవాటెల్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి విశాఖలో బస చేస్తారు. ఆదివారం ఉదయం 7.40 గంటలకు విమానంలో హైదరాబాద్ వెళతారు.
కేజీహెచ్ అడ్మినిస్ట్రేటర్‌గా రమణ నియామకం
మహారాణిపేట: కేజీహెచ్ అడ్మినిస్ట్రేటర్‌గా డిప్యూటీ కలెక్టర్ బి.వి.రమణ నియమితులయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కొత్తగా అడ్మినిస్ట్రేటర్ పోస్టును సృష్టించి.. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పక్కా నివేదికలతో హాజరుకండి : కలెక్టర్ ఆదేశం
మహారాణిపేట: కలెక్టరేట్‌లో ఈ నెల 23న జరిగే జిల్లాస్థాయి అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశానికి పక్కా నివేదికలతో అధికారులు హాజరుకావాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో శుక్రవారం సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్ణీత గడువు కంటే ముందుగానే నివేదికలను సమర్పించాలని సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, వాటి మార్గదర్శకాలు, ప్రయోజనాలపై ఆయా విభాగాల అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆ రోజు మధ్యాహ్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమావేశం జరగనుందని, సంబంధిత ఏర్పాట్లు చేయాలని జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తిని ఆదేశించారు.
నేడు ‘క్వీన్ మేరీస్’లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు
మహారాణిపేట: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ‘వినియోగదారు న్యాయ పాలనకు వర్చువల్ విచారణలు, డిజిటల్ సౌలభ్యం‘అనే అంశంపై పాత పోస్టాఫీసు దరి క్వీన్ మేరీస్ హైస్కూల్లో శనివారం వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నట్టు జేసీ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో హైస్కూల్ స్థాయి విద్యార్థులకు పోటీలు ఉంటాయన్నారు.పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు వెల్లడించారు. విజేతలకు 24న జరిగే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తారు.
సమీకృత క్రీడా ప్రాంగణం పరిశీలన
విశాఖ స్పోర్ట్స్: విశాఖలోని సమీకృత క్రీడా ప్రాంగణాన్ని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి.ఎస్.గిరీశ శుక్రవారం పరిశీలించారు. రుషికొండలోని వాటర్ స్పోర్ట్స్ సెంటర్‌ను పర్యవేక్షించిన ఆయన అవసరమైన తక్షణ మౌలిక సదుపాయాల పనులు చేపట్టాలని ఆదేఽశించారు. డీఎస్‌డీవో జూన్ గాలియట్, వీఎంఆర్‌డీఏ ఈఈ పాల్గొన్నారు.
ఆర్.కె.బీచ్‌లో ఇద్దరిని కాపాడిన లైఫ్‌గార్డులు
ఏయూక్యాంపస్: ఆర్.కె.బీచ్‌లో ప్రమాదం తప్పింది. స్నానానికి దిగిన ఇద్దరు పర్యాటకులు మునిగిపోతుండగా జీవీఎంసీ లైఫ్‌గార్డ్స్ రక్షించారు. హైదరాబాద్‌కు చెందిన వీరేంద్ర, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఉపేంద్ర వర్మ అలల ఉధృతికి(రిప్ కరెంట్) కొట్టుకుపోతుండగా లైఫ్‌గార్డ్స్ వెంకటేష్, రవి వర్మ గమనించారు. వెంటనే స్పందించి ఇద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు జీవీఎంసీ స్పోర్ట్స్ డైరెక్టర్ రాజు తెలిపారు. పర్యాటకులను ప్రాణాపాయం నుంచి రక్షించిన లైఫ్‌గార్డ్స్‌ను జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్ కుమార్ అభినందించారు.
పలు రైళ్ల దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం: విజయవాడ–కాజీపేట సెక్షన్ పరిధిలో ఆధునిక పనుల నేపథ్యంలో ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. కింది రైళ్లు ఆయా తేదీల్లో వయా గుంటూరు–పగిడిపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
● ఈనెల 26 నుంచి జనవరి 8వ తేదీ వరకు విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్ (18519) ఎక్స్‌ప్రెస్, జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు సీఎస్‌టీ ముంబయి–భువనేశ్వర్(11019) కోణార్క్ ఎక్స్‌ప్రెస్, జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు భువనేశ్వర్–సీఎస్‌టీ ముంబయి(11020) కోణార్క్ ఎక్స్‌ప్రెస్, జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు షాలిమర్–హైదరాబాద్ (18045) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, జనవరి 7 నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్–షాలిమర్ (18046) ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 8వ తేదీల్లో షాలిమర్–సికింద్రాబాద్ (22849) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, జనవరి 7న సికింద్రాబాద్–షాలిమర్ (12774) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, జనవరి 8, 9వ తేదీల్లో విశాఖపట్నం–సికింద్రాబాద్ (20833) వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు మళ్లించబడిన మార్గంలో నడుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment