నేటి నుంచి నావికాదళ సన్నాహక విన్యాసాలు
ఏయూక్యాంపస్: ఆర్.కె.బీచ్‌లో ఈ నెల 28, 29, జనవరి 2 తేదీల్లో నౌకాదళ సన్నాహక విన్యాసాలు జరగనున్నాయి. జనవరి 4న నిర్వహించే నౌకాదళ పూర్తి విన్యాసాలకు ముందస్తుగా మూడు రోజుల పాటు రిహార్సల్ చేస్తున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా యుద్ధ నౌకలు, సబ్‌మైరెన్‌లు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, నావికాదళ బ్యాండ్, మైరెన్ కమాండోలు (మార్కోస్) ప్రదర్శనలతో సాగరతీరం యుద్ధ సంగ్రామంలా మారనుంది. విన్యాసాలు తిలకించేందుకు వచ్చే ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు. జనవరి 4 వరకు విన్యాసాలు జరిగే ప్రాంతాల్లో డ్రోన్లు, గాలిపటాలు వంటివి ఎగురవేయవద్దని ప్రజలను కోరారు. కాగా, నేవీ విన్యాసాలకు నౌకాదళం, జీవీఎంసీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వప్రియ ఫంక్షన్ హాలు ఎదురుగా ముఖ్యమంత్రి, ఇతర అధికారుల కోసం ప్రధాన వేదికతో సహా ఇతర వేదికల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. అలాగే ఫుట్‌పాత్‌ను ఆనుకుని బారికేడ్ల నిర్మాణం కూడా పూర్తవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment