1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
● నగర మేయర్ హరి వెంకటకుమారి, కమిషనర్ సంపత్‌కుమార్
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో జనవరి ఒకటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు నిషేధించనున్నట్టు మేయర్ గొలగాని హరి వెంకటకుమారి పేర్కొన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం కమిషనర్ సంపత్‌కుమార్‌తో కలిసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల ప్రత్యామ్నాయాలు, ఇన్‌స్పెక్షన్ సిద్ధాంతాలపై స్కిల్ అప్ గ్రేడేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కమిషనర్ ఆర్.సోమన్నారాయణ, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, జోనల్ కమిషనర్లు, ఏఎంఓహెచ్‌లు, శానిటరీ సూపర్ వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, స్ట్రీట్‌వెండర్స్, వర్తక వ్యాపారస్తులు, జోన్ల కార్యదర్శులతో జూమ్ యాప్ ద్వారా ప్లాస్టిక్ నిషేధంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ భూతాన్ని విశాఖ నగరం నుంచి తరిమి కొట్టాలని, ప్లాస్టిక్‌పై ఐదేళ్లుగా ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బదులు ప్రత్యామ్నా య వస్తువులు అందుబాటులో ఉన్నాయన్నారు. జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ మాట్లాడుతూ జనవరి ఒకటి నుంచి ప్రభుత్వ నిబంధనల మేరకు 120 మైక్రాన్ల లోపు ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించనున్నామని, ఎవరైనా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వ్యాపారస్తునికి ఈ నెల 30లోగా నోటీసులు అందిస్తారన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించే చిన్న వ్యాపారస్తులకు మొదటిసారి రూ.2,500, రెండోసారి రూ.5 వేలతో పాటు వారి ట్రేడ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు. అలాగే జీఎస్టీ పరిధిలోని పెద్ద వ్యాపారస్తులు మొదటి సారి రూ.20వేలు, రెండో సారి పట్టుబడితే రూ.40వేల అపరాధ రుసుంతో పాటు వారి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై వినియోగంతో వస్తున్న వ్యాధులను కేజీహెచ్ చర్మ వ్యాధి వైద్యుడు ప్రొఫెసర్ రాజు, ఆంకాలజీ ప్రొఫెసర్ కుమారి వివరించారు. సెంటర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ హెడ్ డాక్టర్ చంద్రశేఖర్ ప్లాస్టిక్ వస్తువుల్లో రకాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, ప్లాస్టిక్ వస్తువులను గుర్తించే కోడ్‌లు, వాటి వివరాలు పీపీటీ ద్వారా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment