ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఈ నెల 8న జరిగే ప్రధాని మోదీ పర్యటన విజయవంతమయ్యేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్‌తో కలిసి కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రధాని మొదటి సారిగా రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు రెండు లక్షల మంది ప్రజలు కార్యక్రమానికి హాజరుకానున్నారన్నారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయంతో పాటు పార్కింగ్‌కు సంబంధించిన నిబంధనలను ఆయా జిల్లాలకు ముందుగానే సమాచారం తెలపాలని ఆదేశించారు. ప్రధాన వేదిక వద్ద, రోడ్ షో జరిగే ప్రాంతాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో మంత్రుల కమిటీని నియమించామని, ఆదివారం ఈ బృందం జిల్లాలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షిస్తుందని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి, ప్రభుత్వ విప్‌లు గణబాబు, వేపాడ చిరంజీవి రావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఎమ్మెల్యేలు వెలగపూడి, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment