ఏర్పాట్లపై దిశానిర్దేశం
మహారాణిపేట: ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు భారీగా ప్రజలు తరలిరానున్నారన్నారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ నగరంలో 22 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పూడిమడకలో ఎన్.టి.పి.సి.ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్‌ను కూడా ప్రధాన మంత్రి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. నక్కపల్లిలో 2001.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.1876.66 కోట్లతో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్కును వర్చువల్‌గా శంకు స్థాపన చేయనున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
డాబాగార్డెన్స్: నేవీ విన్యాసాలకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విశాఖ వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ పరిశీలించారు. ఆర్కే బీచ్ తదితర ప్రాంతాల్లో పలు విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఈ నెల 8న విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఏయూ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు. ఏయూ గ్రౌండ్‌లో జరిగే ప్రధాని సభకు దాదాపు రెండు లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున వారికి మౌలిక సదుపాయాలు కల్పించనున్నామన్నారు.
పటిష్ట భద్రత
విశాఖ సిటీ: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. శుక్రవారం పోలీస్ సమావేశ మందిరంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. బందోబస్తుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని ఇతర జిల్లాల నుంచి రప్పించాలని నిర్ణయించారు.ఆర్మ్‌డ్ రిజర్వు సిబ్బందితో పికెట్స్ ఏర్పాటుతో పాటు చెక్‌పోస్టులు, రోప్ పార్టీలతో నగరమంతా పటిష్ట భద్రత ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బాంబ్ డిస్పోజల్ సిబ్బంది, ఏఎస్సీ, ఆర్‌ఓపీ, స్నిఫర్ డాగ్ బృందాలతో నగరమంతా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ సిబ్బందిని కాన్వాయ్‌లకు, వీఐపీ వాహనాలకు వినియోగించాలని సూచించారు. గ్రేహౌండ్స్, ఏపీఎస్‌పీ, ఆక్టోపస్ సిబ్బందితో ఏరియా డామినేషన్, ఎమర్జన్సీ, క్విక్ రియాక్షన్ టీం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment