జైలులో ‘సెల్’చల్
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో సెల్‌ఫోన్లు కలకలం రేపుతున్నాయి. జైల్ బ్యారక్‌లలో వరుసగా సెల్ ఫోన్‌లు బయటపడుతుండటంతో అధికారులు కంగుతింటున్నారు. నిషేధించిన వస్తువులు జైల్ లోపలకు ఎలా చేరుతున్నాయో అంతుచిక్కక కొత్తగా వచ్చిన అధికారులు తలలు పట్టుకొంటున్నారు. శుక్రవారం ఓ సెల్ ఫోన్ లభించింది. నాలు గు రోజుల కిందట రెండు సెల్ ఫోన్‌లు దొరికిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు బ్యారక్‌లలో మూడు సెల్ ఫోన్‌లు దొరకడంతో ఇంకెన్ని సెల్ ఫోన్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయో అని అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. తనిఖీల్లో భాగంగా శుక్రవారం నర్మదా బ్యారక్‌ను పరిశీలించినట్లు జైల్ సూపరింటెండెంట్ ఎం. మహేష్‌బాబు తెలిపారు. ఈ తనిఖీలలో ఆ బ్యారక్ స్టోర్ రూం మెట్ల కింద గచ్చులో చేసిన రంధ్రంలో ఓ డబుల్ సిమ్ సెల్ ఫోన్ దొరికినట్లు తెలిపారు. దాన్ని స్వాధీనం చేసుకుని ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గత నెల 31న రెండు సెల్ ఫోన్‌లు, ప్రస్తుతం దొరికిన సెల్ ఫోన్లపై ఆరిలోవ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు.
ఎవరు వినియోగిస్తున్నారు..?
విశాఖ కేంద్ర కారాగారంలో ఏ ఖైదీలు సెల్ ఫోన్‌లు వినియోగిస్తున్నారో అనే దానిపై జైల్ అధికారులు, ఆరిలోవ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత కట్టుదిట్టమైన రక్షణ వలయంను ఛేదించుకుని సెల్ ఫోన్‌లను జైల్ లోపలకు ఎవరు అందిస్తున్నారో అనేది అంతుచిక్కడంలేదంటూ అధికారులు అంటున్నారు. జైల్‌సిబ్బంది ప్రమేయంతోనే సెల్ ఫోన్‌లు లోపలకు వెళుతున్నాయని భావిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 31న పెన్నా బ్యారక్‌లో రెండు సెల్ ఫోన్‌లు, ఒక పవర్ బ్యాంక్, ఒక కీ ప్యాడ్ ఫోన్, రెండు కేబుళ్లు బయటపడ్డాయి. వాటిని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడు, రౌడీ షీటర్ కోలా హేమంతకుమార్, మరో రౌడీషీటర్ రాజేష్ వినియోగించినవిగా జైల్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారిరువురిపైనా సెల్ ఫోన్‌లు వినియోగిస్తున్నట్లు అనుమానం ఉన్నట్లు పేర్కొన్నామని సూపరింటెండెంట్ మహేష్‌బాబు తెలిపారు. శుక్రవారం బయటపడిన సెల్ ఫోన్ ఎవరు ఉపయోగించారో, దాన్ని ఎవరు లోపలకు తీసుకొచ్చారో తేలాల్సి ఉంది.
కలకలం రేపుతున్న సెల్‌ఫోన్ల లభ్యత
జైలుకు ఎలా చేరుతున్నాయో ప్రశ్నార్థకం
తలలు పట్టుకుంటున్న అధికారులు
జైల్ సిబ్బందిపై అనుమానం
Comments
Please login to add a commentAdd a comment