నగర సమగ్ర ప్రగతికి కృషి
డాబాగార్డెన్స్: కార్పొరేటర్లు, జిల్లా యంత్రాంగంతో కలిసి నగరాన్ని అభివృద్థి పథంలో నడుపుతున్నట్లు మేయర్ గొలగాని హరి వెంకటకుమారి తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్, జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. 2024లో సాధించిన ప్రగతి, గుర్తించిన లోపాలను సరిదిద్దుకుని.. 2025లో విశాఖ నగర సమగ్ర అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామని మేయర్ వెల్లడించారు.
‘2024–25 సంవత్సరానికి జీవీఎంసీ పరిధిలో రూ.185.21 కోట్ల అంచనాలతో 813 పనులు చేపట్టగా, రూ.18.19 కోట్లతో 197 పనులు పూర్తయ్యాయి. రెండు దశల్లో రూ.131.84 కోట్లతో 22 ప్రధాన రహదారుల అభివృద్ధికి ప్రతిపాదించగా, 13 పనులు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. రూ.5.28 కోట్లతో 2,771 పాత్‌హోల్స్ పూడ్చాం. రూ.36.33 కోట్ల అంచనాలతో ఐదు స్టేడియంల పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.10.53 కోట్ల అంచనాలతో ఆరు శ్మశాన వాటికల మరమ్మతు పనులు చేపట్టగా, ఒకటి పూర్తయింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ.1000 కోట్లతో 61 పనులు చేపట్టగా, రూ.672 కోట్లతో 58 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాల్లో ఏడీబీ నిధులతో రూ.447.62 కోట్లతో చేపట్టిన 24 గంటల మంచినీటి సరఫరా పథకం పనులు 71 శాతం పూర్తయ్యాయి. అమృత్ 2.0 పథకంలో భాగంగా మంచినీటి సరఫరా అభివృద్ధికి రూ.356.42 కోట్లతో 27 ప్రాజెక్టులు చేపట్టగా, పీపీపీ పద్ధతిలో రూ.150 కోట్లతో ఒక ప్రాజెక్టు, రూ.26.42 కోట్లతో నాలుగు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో జాతీయ స్థాయిలో 4వ పరిశుభ్ర నగరంగా గుర్తింపు, వరుసగా మూడేళ్లపాటు వాటర్‌ప్లస్ ధ్రువీకరణ, 5 స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్ విశాఖకు లభించాయి. 2024లో 143 మలేరియా, 642 డెంగ్యూ, 5 చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. 2024లో 15,096 జననాలు, 14,968 మరణాలు సంభవించాయి. 1,44,680 మందికి నెలకు రూ.62.78 కోట్ల పింఛన్లు చెల్లిస్తున్నాం. ఆన్‌లైన్ బిల్డింగ్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా 3,385 బిల్డింగ్ అప్లికేషన్లు మంజూరు చేయగా రూ.110.25 కోట్లు, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా 2,686 దరఖాస్తులు పరిష్కరించగా రూ.65.7 కోట్లు జీవీఎంసీకి ఆదాయం వచ్చింది. 84.84 కిలోమీటర్ల పొడవున 15 మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులు జరుగుతున్నాయి. 2024–25 సంవత్సరానికి రూ.470 కోట్ల ఆస్తి పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకోగా, డిసెంబర్ 16 వరకు రూ.283.59 కోట్లు వసూలయ్యాయి. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఏప్రిల్‌లో రూ.118.58 కోట్లు వచ్చాయి. జీవీఎంసీకి స్వచ్ఛ బాగీదారి పురస్కారం, పీఎం స్వనిధి ప్రథమ స్థాన పురస్కారం జీవీఎంసీకి లభించాయి. ’ అని మేయర్ వివరించారు. ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు కొత్త ఏడాదిలో అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
మేయర్ గొలగాని హరివెంకటకుమారి
Comments
Please login to add a commentAdd a comment