విశాఖ చేరుకున్న ‘షార్జా’ బాధితులు
● పోలీస్ కమిషనర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు ● సీపీ స్పందనతో సురక్షితంగా విశాఖకు
గోపాలపట్నం: ఉద్యోగాల కోసం షార్జా వెళ్లి, అక్కడ అనుకున్న ఉద్యోగం రాకపోవడంతో ఇబ్బందుల్లో పడిన బాధితులు, విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి చొరవతో సురక్షితంగా నగరానికి చేరుకున్నారు. బుధవారం విశాఖ విమానాశ్రయంలో సీపీతో కలిసి బాధితులు మీడియాకు తెలిపిన వివరాలు.. గాజువాక ఆటోనగర్‌లోని మణికంఠ వెల్డింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో వెల్డింగ్ శిక్షణ ఇచ్చి, దుబాయ్‌లో ఉద్యాగావకాశాలు కల్పిస్తామన్న ప్రకటన చూసి అనకాపల్లి జిల్లా నాతవరం మండలం పీకే గూడేనికి చెందిన పోలుపర్తి లక్ష్మీనారాయణ, గార రాజేష్, పైలా రామస్వామి, శ్రీకాకుళం జిల్లా కంచిలికి చెందిన కాళ్ల వెంకటరావు, విశాఖలోని పెదగంట్యాడ సీకువానిపాలేనికి చెందిన గెద్దాడ లోకేష్‌లు ఆ సంస్థను సంప్రదించారు. ఏజెంట్లు దుర్గాప్రసాద్ అలియాస్ ప్రసాద్, చందులు మణికంఠ వెల్డింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోనే ఇంటర్వ్యూలు, మెడికల్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఎంపికై న వీరికి విశాఖ వెల్డింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో వెల్డింగ్ శిక్షణ ఇచ్చారు. అనంతరం గతేడాది నవంబర్ 12న షార్జాలోని క్వాలిటీ ఇంటర్నేషనల్ కంపెనీలో వెల్డర్ ఉద్యోగాలకు పంపారు. అక్కడికి చేరాక వీరికి 6జీ వెల్డింగ్ కాకుండా 3జీ వెల్డింగ్ ఇచ్చి పరీక్షించారు. అందులో అర్హత పొందకపోవడంతో వెల్డర్లుగా కాకుండా.. లేబర్ ఉద్యోగాలిచ్చారు. వీరంతా టూరిస్ట్ వీసాతో వెళ్లడం వల్ల, కాల పరిమితి ముగిస్తే ఇబ్బందుల్లో పడతామనే ఆందోళనతో ఏజెంట్లను సంప్రదించారు. ఏజెంట్లు సకాలంలో స్పందించక పోవడంతో, విశాఖ నగర పోలీస్ కమిషనర్ నంబర్ (7995095799)లో తమ గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన సీపీ ఇమిగ్రేషన్ అధికారులతో చర్చించి, వెస్ట్, గాజువాక పోలీసుల సహకారంతో ఏజెంట్ల ద్వారా ఈ ఐదుగురిని విశాఖకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. నగరానికి చేరుకున్న వీరు సీపీ శంఖబ్రత బాగ్చికి కృతజ్ఞతలు తెలిపారు.
ఏజెంట్ల వివరాలు సేకరిస్తున్నాం
ఏజెంట్ల ద్వారా ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లి మోసపోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి మీడియాకు తెలిపారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్ల వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఇమిగ్రేషన్ అధికారుల సహకారాన్ని తీసుకుంటామన్నారు. బాధితులు విశాఖ వచ్చేందుకు అయిన ఫ్లైట్ చార్జీలు, ఏజెంట్లకు ఇచ్చిన నగదు వారికి తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఇబ్బందులకు గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment