పర్యాటక పాలసీలో లోటుపాట్లు సవరిస్తాం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన టూరిజం పాలసీలో లోటుపాట్లు పరిశీలించి.. అన్ని వర్గాల సలహాలు సూచనలు తీసుకుని సవరణలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ కాటా ఆమ్రపాలీ స్పష్టం చేశారు. మూడు రోజుల విశాఖ పర్యటనలో భాగంగా.. ఆమె వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం ప్రతినిధులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. ఏపీ టూరిజం ఫోరం అధ్యక్షుడు కె.విజయ్‌మోహన్, కార్యదర్శి ఎం.వి. పవన్ కార్తీక్ పాలసీలో హోటల్స్ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం గురించి ఆమెకు వివరించారు. సింగిల్ విండో పాలసీపై విధివిధానాలు జారీ చేయాలని కోరారు. పాలసీలో భాగంగా పర్యాటక రంగానికి ప్రకటించిన ప్రోత్సాహకాలు ఎప్పటి నుంచి వస్తాయనే దానిపై స్పష్టత లేదనీ.. అదేవిధంగా.. కొత్త హోటల్స్‌కు రాయితీలు ప్రకటించారనీ.. ప్రస్తుతం నడుస్తున్న హోటల్స్ గురించి కూడా పాలసీలో జోడించాలని కోరారు. ఉమ్మడి విశాఖతో పాటు ఏపీలో పర్యాటక అభివృద్ధి అవకాశాల గురించి ఆమ్రపాలి ఫోరం ప్రతినిధుల్ని అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాంధ్రలో పర్యాటకాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఫోరం ఉపాధ్యక్షుడు ప్రశాంత్ తెలిపారు. ఇక వీఎంఆర్‌డీఏ చేపడుతున్న టూరిజం ప్రాజెక్టులపై ఆమ్రపాలి నేడు సమీక్ష నిర్వహించనున్నారు.
26న టూరిజం రీజనల్ సదస్సు
పర్యాటక అభివృద్ధి, ప్రాజెక్టులు, పొరుగు రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లతో ఒప్పందాలు.. మొదలైన అంశాలపై చర్చించేందుకు ఈనెల 26న పర్యాటక ప్రాంతీయ సదస్సు జరగనుంది. నగరంలోని నోవోటెల్ హోటల్‌లో రీజనల్ సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నామని టూరిజం ఇన్‌చార్జ్ ఆర్‌డీ రమణ ప్రసాద్ తెలిపారు.
ఏపీ టూరిజం కార్పొరేషన్
ఎండీ ఆమ్రపాలి
Comments
Please login to add a commentAdd a comment