రోజుకు 1000 ట్రిప్పులు.... ఇందులో 150 పోను... మిగిలిన 850 ట్రిప్పులకు రూ.22 వేల చొప్పున మొత్తం రూ.1.87 కోట్లు!! ఇవేం లెక్కలు అనుకుంటున్నారా.... అనకాపల్లి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో కూటమి నేతలు చేస్తున్న నెలవారీ వసూళ్ల లెక్కలివి. మైనింగ్ శాఖతో పాటు రవాణా, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులకు నెలనెలా ముడుపులు ముడుతున్నాయనీ, అందుకే అనేక అవకతవకలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
కొత్త ప్రభుత్వంలో సరికొత్త టిప్పర్లు.. ఎక్కడా తేడా రాకుండా ఎంచక్కా వాటాలు.. ఎవరూ నోరు తెరవకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు.. కూటమి ప్రభుత్వంలో మైనింగ్ దందా ఎంత పకడ్బందీగా సాగిపోతోందో చూడండి.. అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న వివిధ క్వారీల ద్వారా రోజుకు 1,000 ట్రిప్పుల్లో బండరాళ్లు తరలిపోతున్నాయి. వివిధ అధికార, అనధికార క్వారీల నుంచి మునగపాక మీదుగా రోడ్లపై భారీ శబ్దాలు చేస్తూ రాంబిల్లిలోని నావికాదళ పనుల వరకూ ప్రతి రోజూ చక్కర్లు కొడుతున్నాయి. 32–36 టన్నుల సామర్థ్యం కలిగిన టిప్పర్లలో ఏకంగా 50 టన్నుల మేరకు భారీ బండరాళ్లు వేసుకుని తిరుగుతున్నా ఈ టిప్పర్ల వైపు అటు మైనింగ్ అధికారులు కానీ, ఇటు రవాణాశాఖ, పోలీసు, రెవెన్యూ అధికారులు కానీ కనీసం కన్నెత్తి చూడటం లేదు. ఇందుకు కారణం ప్రతి నెలా ఒక్కో ట్రిప్పునకు రూ.22 వేలు చొప్పున కూటమి నేతలు ట్యాక్స్ వసూలు చేస్తుండటమే. ఇందులో అనకాపల్లి ఎంపీకి చెందిన సీఎం రమేష్ ట్రిప్పులను మినహాయించి మిగిలిన 850 ట్రిప్పులు తోలుతున్న వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి నెలకు ఠంచనుగా రూ.22 వేల మేర వసూలు చేస్తున్నారు. ఈ లెక్కలన్నీ అనకాపల్లికి చెందిన కూటమి నేత బంధువు చూస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక లోడుతో వస్తున్న ఈ వాహనాల రాకపోకలపై ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో రోడ్లన్నీ ఛిద్రమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో నెలవారీగా వసూలవుతున్న మొత్తం రూ.1.87 కోట్లలో కూటమి నేతలతో పాటు మైనింగ్, రవాణా, పోలీసు, రెవెన్యూ అధికారులకూ భారీగా వాటాలు అందుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment