ఎన్నో జ్ఞాపకాలు.. ఇంకెన్నో అనుభూతులు
అట్టహాసంగా ప్రారంభమైన భీమిలి ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాలు
భీమునిపట్నం: భీమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పాఠశాల ఆవరణలోని జూనియర్ కళాశాల మైదానంలో వేదిక ఏర్పాటు చేయగా, పలు ప్రాంతాల నుంచి పూర్వ విద్యార్థులు తరలివచ్చి ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాల రోజుల్లోని సరదాలు, ఆటలు, ఉపాధ్యాయులతో అనుబంధం, స్నేహితులతో కలిసి చేసిన అల్లరి ఇలా ఎన్నో జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. తాము చదువుకున్న తరగతి గదులను, ఆట స్థలాన్ని, గ్రంథాలయాన్ని సందర్శించి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులు నృత్యాలు చేయడంతోపాటు పాటలు పాడి అలరించారు. బాలికలు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల శతాబ్ది ఉత్సవాల పైలాన్‌ను పూర్వ విద్యార్థులైన జార్ఖండ్ ఐజీ క్రాంతి కుమార్, ఇన్‌కం ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ మహీధర్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఐజీ క్రాంతికుమార్ మాట్లాడుతూ అప్పటి ఉపాధ్యాయులు బాగా బోధించారని, తద్వారా బాగా చదువుకోవడానికి తనకు మంచి అవకాశం లభించిందన్నారు. తన తండ్రి ఇక్కడే ఉపాధ్యాయుడిగా పని చేశారని గుర్తు చేశారు. తన అక్కలు, చెల్లెలు ఇక్కడే చదివారని, వాళ్లందరూ ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారని చెప్పారు. చక్కని క్రమశిక్షణ, ఉపాధ్యాయుల సహకారంతో తామంతా ఎదిగామని, ఈ పాఠశాల తమకు దేవాలయం అని చెప్పారు. మంచి స్నేహితులు ఉండడం తన అదృష్టమన్నారు. ఏటా 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తానని ప్రకటించారు. అడిషనల్ ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ ఎం.మహీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్యా బోదన ఉంటుందని, తామందరం ఇక్కడ చదివిన వాళ్లమేనన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడంతో ఈ స్థాయిలో ఉన్నామని, విద్యార్థులు బాగా చదువుకోవాలని పిలుపునిచ్చారు.
మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దాలి
ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ పాఠశాలను ప్రభుత్వ పరంగా మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గాడు అప్పలనాయుడు అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే గంటాను కోరారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయుడు పి.వి.జె.మోహనరావు, ఎమ్మెల్యే గంటాను సత్కరించారు. చిన్నబజారు, పెద్దబజారు మెయిన్‌రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఉత్సవ కమిటీ కార్యదర్శి మైలిపల్లి లక్ష్మణరావు, ముఖ్య సభ్యులు మైలపల్లి షణ్ముఖరావు, కాళ్ల సన్నీ, ఎం.వి.పార్వతీశం, రాజేటి బసవకృష్ణమూర్తి, కె.ముత్యాలరావు, టి.భీమారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment