పింఛను కష్టాలు ఇన్నిన్ని కాదయా.!
మహారాణిపేట: పింఛన్ల పంపిణీ సమయంలో వృద్ధులు, వితంతువుల కష్టాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఒకటో తేదీ వచ్చిందంటే చాలు లబ్ధిదారులు సచివాలయాలకు క్యూ కడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ వలంటీర్లు వచ్చి పింఛన్లు పంపిణీ చేసేవారు. కానీ, ఈ ప్రభుత్వంలో అందరినీ ఒక చోటకు చేర్చి అందిస్తుండటంతో వృద్ధులు అవస్థలు పడుతున్నారు. పెదజాలరిపేట, మధురవాడలోని శివశక్తినగర్ తదితర ప్రాంతాల్లో శనివారం ఈ పరిస్థితి కనిపించింది. సాంకేతిక సమస్యతో నగరంలోని పలుచోట్ల మధ్యాహ్నం 12 గంటల వరకు పంపిణీ జరగలేదు. పెదజాలరిపేట సచివాలయానికి 12 గంటల తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చి పింఛన్లు అందజేశారు. శనివారం రాత్రి 7 గంటల సమయానికి 1,52,835 మందికి రూ. 66.74 కోట్లు అందజేశారు. జిల్లాలో మొత్తం 1,60,757 పింఛన్‌దారులు ఉండగా, ప్రభుత్వం రూ. 69,74,77,500 విడుదల చేసింది. తుది సమాచారం మేరకు జిల్లాలో 95.07 శాతం మందికి పింఛన్లు అందజేశామని, మిగిలిన వారికి సోమవారం పంపిణీ చేస్తామని డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీపతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment