నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
● సెల్ఫ్ సెంటర్లలో పరీక్షలు ● జిల్లాలో 153 పరీక్ష కేంద్రాలు ● హాజరుకానున్న 39,529 మంది విద్యార్థులు
విశాఖ విద్య : ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు జిల్లాల్లో సర్వం సిద్ధం చేశారు. విద్యార్థులు చదువుకున్న కాలేజీ(సెల్ఫ్ సెంటర్)ల్లోనే సీసీ కెమెరాల పర్యవేక్షణలో సోమవారం నుంచి ఈ నెల 20 వరకు జిల్లాలో ఎంపిక చేసిన 153 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్స్ పర్యవేక్షణకు విధులు కేటాయించే అధ్యాపకుల జాబితాను సైతం ఆన్‌లైన్ ద్వారా నేరుగా కాలేజీలకు పంపించారు.
ల్యాబ్ ఉన్న కాలేజీలకే అనుమతి
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 153 కేంద్రాలను ప్రాక్టికల్ పరీక్షల కోసం ఎంపిక చేశారు. పరీక్షల నిర్వహణకు అనువైన సౌకర్యాలు లేకపోవటంతో కొన్ని కాలేజీలను జాబితా నుంచి తప్పించారు. ఇలాంటి కాలేజీల విద్యార్థులు సమీపంలోని మరో కేంద్రంలో ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం ఎంపీసీ విద్యార్థులు 34,645 మంది, బైపీసీ విద్యార్థులు 4,884 మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతీ రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం ప్రారంభమయ్యే మొదటి స్పెల్ పరీక్షలు 146 కేంద్రాల్లో జరగనుండగా, ఉదయం 7,562 మంది, మధ్యాహ్నం 5,717 మంది హాజరవుతారని అధికారులు వెల్లడించారు.
కార్పొరేట్ కాలేజీలపై ప్రత్యేక నిఘా
ఇంటర్మీడియెట్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ మార్కులు ఎంతో కీలకమైనవి. ఎంపీసీలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం.. బైపీసీలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, బోటనీ, జువాలజీ సబ్జెక్జులకు సంబంధించి ప్రాక్టికల్స్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఒక్కో పరీక్షకు 30 మార్కులు ఉంటాయి. కార్పొరేట్ కాలేజీల్లో ప్రయోగ పరీక్షలపై నిఘా పెంచారు. పరీక్షల నిర్వహణ మొత్తాన్ని సీసీ కెమెరాల్లో రికార్డు చేయనున్నారు. దీనిని నగరంలోని ఆర్‌ఐవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోలర్ రూమ్‌తో పాటు, ఇంటర్మీడియెట్ బోర్డు ఉన్నతాధికారుల సైతం పర్యవేక్షణ చేసేలా తగిన ఏర్పాట్లు చేశారు.
వాట్సాప్‌లోనూ హాల్ టికెట్లు
ప్రాక్టికల్ పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి. విద్యార్థులు హాల్ టికెట్లను 9552300009 నంబర్ గల వాట్సాప్‌లో అందుబాటులో ఉంటాయి. కేంద్రాల్లో ఇబ్బందులపై 0891–2567561, 9440135490, 9440137955 ఫోన్ నంబర్లులో సంప్రదించాలి.
– పి.మురళీధర్, ఆర్‌ఐవో
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
Comments
Please login to add a commentAdd a comment