![బాబోయ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09vscp09-600449_mr-1739128678-0.jpg.webp?itok=747rkFmU)
బాబోయ్.. జ్వరాలు
● భయపెడుతున్న డెంగ్యూ, మలేరియా కేసులు ● కొద్ది రోజులుగా కదలని ఫాగింగ్ యంత్రాలు ● దోమల నివారణ కోసం సర్వే చేసే 431 మంది సిబ్బంది తొలగింపు ● నగరంలో పేరుకుపోతున్న వ్యర్థాలు
డెంగ్యూ, మలేరియా
కేసుల నమోదు
దోమల ప్రభావంతో డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్య తదితర జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. ఏడిస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం సోకుతుంది. ఈ దోమ పగటి పూట కాటు వేస్తుంది. మిగిలిన జ్వరాల కంటే డెంగ్యూ జ్వరం చాలా ప్రమాదకరం. ప్రస్తుతం నగరంలో డెంగ్యూ జ్వర బాధితులు కేజీహెచ్‌తో పాటు వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నగరంలో 23 మంది డెంగ్యూ బాధితులు, పదిమంది మలేరియా రోగులు చికిత్స పొందుతున్నారని జిల్లా వైద్యశాఖ అధికారులు తెలిపారు.
మహారాణిపేట: విశాఖకు జ్వరమొచ్చింది. నగరంలో ఎక్కడ చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. అన్ సీజన్‌లో సైతం జ్వరాలు విజృంభిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మలేరియా, డెంగ్యూ, ఇతర వైరల్ జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ.. దోమల స్వైర విహారం మాత్రం తగ్గడం లేదు. దోమల నియంత్రణపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దోమలను నివారించే ఫాగింగ్ యంత్రాలు మూలకు చేరడం, దోమల నియంత్రణపై సర్వే చేసే సిబ్బందిని తొలగించడంతో ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా నగరంలో జ్వరబాధితులు పెరుగుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి ప్రైవేటు క్లినిక్‌ల వరకు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి.
ఫాగింగ్ యంత్రాలకు ఆయిల్ కష్టాలు
దోమలను నివారించే ఫాగింగ్ యంత్రాలకు ఆయిల్ కష్టాలు పట్టి పీడిస్తున్నాయి. దీంతో కొద్ది రోజులుగా ఫాగింగ్ యంత్రాల వాహనాలు షెడ్డులకే పరిమితమయ్యాయి. జీవీఎంసీ పరిధిలో మొత్తం 8 ఫాగింగ్ యంత్రాల వాహనాలున్నాయి. 50 స్ప్రేయింగ్ మెషీన్లున్నాయి. మరోవైపు దోమల నివారణ కోసం సర్వే చేయడం, ఏ ఏరియాలో దోమలు ఎక్కువగా ఉన్నాయో గుర్తించే సిబ్బందిని సైతం విధులను తొలగించారు. ఇప్పుడు స్థానికంగా స్ప్రే చేసే సిబ్బంది కొరత ఏర్పడింది. ఫాగింగ్‌యంత్రాల వాహనాలకు ఉపయోగించే ఆయిల్ లేకపోవడంతో స్ప్రేయింగ్ మెషీన్లు నిరుపయోగంగా మారాయి. జీవీఎంసీకి రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో దోమల నియంత్రణపై ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే ఫాగింగ్ యంత్రాల వాహనాలకు ఆయిల్ కొనుగోలుకు కలెక్టర్ హరేందిర ప్రసాద్ నిధులు మంజూరు చేసినట్టు తెలిసింది.
అన్‌సీజన్‌లో జ్వరాల తీవ్రత
సాధారణంగా జ్వరాలు జూలై నుంచి అక్టోబర్ వరకు ఎక్కువగా వస్తుంటాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు దోమల వృద్ధికి అన్ సీజన్‌గా చెబుతుంటారు. ఈసారి మాత్రం విచిత్రంగా ఎండలు పెరుగుతున్న సమయంలో కూడా దోమలు బెడద తప్పడం లేదు. అపారిశుధ్యం కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు, మురుగు కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోవడం, భూగర్భ డ్రైనేజీలు పొంగి ప్రవహించడం వంటి దృశ్యాలు నగరంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. కాలువల్లో సకాలంలో పూడికలు తీయకపోవడం కారణంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి.
పేరుకుపోయిన చెత్తాచెదారం
నగరంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. పూర్ణామార్కెట్ వెనుక భాగం, దొండపర్తి, లలితానగర్, వెలంపేట, రేసవానిపాలెం ఐటీ సంస్థ, ప్రసాద్ గార్డెన్స్, రెల్లివీధి, పంజా జంక్షన్, అల్లిపురం, రామకృష్ణ జంక్షన్ రైతుబజార్ ప్రాంతాల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. వరుసగా రెండు రోజులు సెలవుల వస్తే నగరంలో పలు ప్రాంతాలు డంపింగ్ యార్డుల్లా మారిపోతున్నాయి.
431 మంది ఉద్యోగుల తొలగింపు
దోమల నివారణ కోసం, ఏ ప్రాంతంలో ఎక్కువ దోమలున్నాయో గుర్తించడం కోసం సర్వే చేస్తున్న తాత్కాలిక సిబ్బందిని తొలగించారు. దాదాపు 431 మంది సిబ్బందిపై వేటు వేశారు. ఈ తాత్కాలిక సిబ్బంది వార్డుల్లో పర్యటిస్తూ దోమల గుడ్లు పెట్టే ఏరియాలను పరిశీలించి అక్కడ ఫాగింగ్ చేసేవారు. వీరికి నెలకు రూ.16,470 గౌరవ వేతనం వచ్చేవారు. ఇటీవల 431 మంది తొలగించారు.
![బాబోయ్.. జ్వరాలు1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09vsc93a-600449_mr-1739128678-1.jpg)
బాబోయ్.. జ్వరాలు
![బాబోయ్.. జ్వరాలు2](https://www.sakshi.com/gallery_images/2025/02/10/mosquito_mr-1739128678-2.jpg)
బాబోయ్.. జ్వరాలు
Comments
Please login to add a commentAdd a comment