![కంటి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09ylm43-320106_mr-1739128677-0.jpg.webp?itok=VxCPSJDn)
కంటి వెలుగులు.. కన్నీటిపాలు
● వాడపాలెం తీరంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల గల్లంతు ● ఒకరి మృతదేహం లభ్యం ● మరొకరి ఆచూకీ దొరకని వైనం ● మత్స్యకారులు, మైరెన్ పోలీసుల సాయంతో గాలింపు
అయ్యోదేవుడా ఎంత పని జరిగిపోయింది...కళ్ల ముందే కన్నకొడుకులను తీసుకువెళ్లిపోయావా.. ఇక మాకు దిక్కెవరూ.. స్నానం చేసి వెంటనే వచ్చేస్తాం.. వచ్చిన వెంటనే ఇంటికి వెళ్లిపోదాం అంటూ వెళ్లారు... అంతలోనే
గంగలో కలసిపోయారా నాయనలారా...
అంటూ కన్నవాళ్ల రోదనలతో చూపరులు కన్నీటి సంద్రమయ్యారు. చేతికి అంది వచ్చిన కుమారులు కళ్ల ముందే సముద్రంలో కొట్టుకుపోతున్నా కాపాడలేని నిస్సహాయ స్థితిలో విలపించారు.
రాంబిల్లి (యలమంచిలి): అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడపాలెం సముద్రతీరంలో ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు స్నానానికి దిగి గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభించగా, మరొకరి ఆచూకీ తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి రాంబిల్లి సీఐ సీహెచ్.నరసింగరావు, మృతుని కుటుంబ సభ్యులు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం... రాంబిల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన అన్నదమ్ములైన మొక్కశ్రీధర్, మొక్క మల్లికార్జునరావు వృత్తి రిత్యా విశాఖపట్నంలో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మొక్క శ్రీధర్ ఎల్‌ఆండ్‌టీ కంపెనీలో పనిచేస్తూ కంచరపాలెం ఇందిరానగర్‌లో పాప బాబుతో నివసిస్తున్నాడు. మల్లికార్జునరావు సీఐఎస్‌ఎఫ్‌లో ఉద్యోగిగా పనిచేస్తూ దువ్వాడ దగ్గర సంధ్యనగర్ వద్ద పాప, బాబు భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. శ్రీధర్ కుమారుడు సూర్యతేజ్ (17) తగరపువలస వద్ద ఉన్న అనిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రథమ సంవత్సరం కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మల్లికార్జునరావు కుమారుడు పవన్‌తేజ (17) దువ్వాడ వద్ద ఉన్న విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీఈ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. వీరు ఆదివారం ఉదయం సూర్యదేవుని నోములు పండగను రాంబిల్లి మండలంలో వారి కుటుంబ సభ్యులు అందరితో జరుపుకోవడానికి వచ్చారు. ఉదయం పూజలు చేసుకొని మధ్యాహ్నం వాడపాలెం సముద్రతీర ప్రాంతానికి వెళ్లారు. తీరం వద్ద సందడిగా గడిపారు. 3.30 నుంచి 4 గంటల సమయంలో సూర్యతేజ, పవన్‌తేజ సముద్రంలో స్నానానికి వెళ్లి కెరటాల ఉధృతికి కొట్టుకుపోయారు. సమీపంలో ఉన్న మత్స్యకారులు సమాచారం తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టగా సాయంత్రం సూర్యతేజ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ మత్స్యకారులకు చిక్కాడు. వారు సూర్యతేజకు సి.పి.ఆర్ ప్రథమ చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో మృతి చెందాడు. సూర్యతేజ మృతదేహాన్ని అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆస్పత్రికి తరలించగా సమాచారం అందుకున్న రాంబిల్లి పోలీసులు, మైరెన్ పోలీసులు, స్థానిక మత్స్యకారుల సహాయంతో తీరం వెంబడి పవన్‌తేజ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరవాడ డీఎస్పీ విశ్వస్వరూప్ సంఘటన స్థలానికి చేరుకొని సమీక్షించారు. రాత్రయినా పోలీసులు అక్కడే ఉండి పర్యక్షించాలని ఆదేశించారు. కొత్తపేట గ్రామానికి చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారన్న వార్త తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు వాడపాలెం తీరం వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు.
![కంటి వెలుగులు.. కన్నీటిపాలు1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09ylm43a-320106_mr-1739128677-1.jpg)
కంటి వెలుగులు.. కన్నీటిపాలు
![కంటి వెలుగులు.. కన్నీటిపాలు2](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09ylm43b-320106_mr-1739128677-2.jpg)
కంటి వెలుగులు.. కన్నీటిపాలు
Comments
Please login to add a commentAdd a comment