ఎర్ర జెండాలతో.. ఎరుపెక్కిన విజయనగరం
● ఘనంగా ప్రారంభమైన ఏఐఎస్‌ఎఫ్ మహాసభలు
● వేలాది మంది విద్యార్థులతో కాంప్లెక్స్ నుంచి ర్యాలీ
● గురజాడ కళాక్షేత్రంలో బహిరంగ సభ
● ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న హాజరు
విజయనగరం పూల్‌బాగ్: జిల్లాకేంద్రంలో ఏఐఎస్‌ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభల సందర్భంగా బుధవారం ర్యాలీ, బహిరంగ సభలను జయప్రదంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ రంగరాజ్, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నలు హాజరై ప్రసంగించారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం వల్ల లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని, విద్యార్థుల మెదళ్లలో మతోన్మాదాన్ని నింపి విద్యార్థుల మధ్య మత ఘర్షణలను పెంచి పోషిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి విద్యార్థులంతా భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దీనిని అడ్డు కోవాలంటే కేవలం శాసీ్త్రయ విద్యా విధానం వల్లనే జరుగుతుందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తోందని, పేదల ఆకలి తీర్చకుండా అంబానీ, అదానీల కుటుంబ ఆస్తులను పెంచడానికి పనిచేస్తూ దేశ సంపదనంతా వారికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు.
రోడ్డున పడనున్న లక్షలాదిమంది
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది ఉపాధి కోల్పోతారని వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడంలో విద్యార్థులు ముందుండాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై ఏఐఎస్‌ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభల్లో నూతన పోరాట పంథాను ఏర్పాటు చేసుకుని ముందుకు కొనసాగాలని అభిలషించారు. కార్యక్రమంలో మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కామేశ్వరరావు, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య, ఏఐఎస్‌ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు నక్కిలేని బాబు, మహంకాళి సుబ్బారావు, పరుచూరి రాజేంద్ర, బుగత అశోక్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ షేక్ మస్తాన్, ఫణీంద్ర కుమార్, బండి చలపతి, బందెల నాసర్, జి.నాగభూషణ్, కుల్లాయి స్వామి, వల రాజు, సాయికుమార్, షాబీర్ బాషా, రాష్ట్ర ప్రజానాట్యమండలి నాయకులు చంద్రనాయక్, పెంచలయ్య, రామకృష్ణ రామారావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment