‘ఉపాధి’లో రికవరీ చేయాల్సిన మొత్తం
రూ.1.29 కోట్లు
తెర్లాం: జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది నుంచి రూ.1.29 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని డ్వామా పీడీ కల్యాణచక్రవర్తి చెప్పారు. తెర్లాంలో బుధవారం జరిగిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికలో పాల్గొనడానికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని అన్ని మండలాల్లో ఇంతవరకు జరిగిన సామాజిక తనిఖీల్లో తనిఖీ బృందం పనుల్లో జరిగిన అవకతవకలపై ఇచ్చిన నివేదికపై సంబంధిత అధికారులు, సిబ్బందిపై రికవరీ రాశామన్నారు. దీనికి సంబంధించి జిల్లాలో కోటి 29లక్షల రూపాయలు వసూలు చేయాల్సి ఉందని తెలిపారు. రికవరీ వసూళ్లకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో జరిగిన సామాజిక తనిఖీల్లో మరణించిన వారి పేరున మస్తర్లు వేస్తున్నట్లు, వేతనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పని రాని మేట్లకు స్థానికంగా శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం ద్వారా ఫారంపాండ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, అన్ని మండలాల్లో తప్పనిసరిగా ఆ పనులు చేపట్టాలని ఏపీఓలకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఆయనతో పాటు ఎంపీడీఓ రాంబాబు, ఏపీడీ శ్రీనివాసరావు, ఏపీఓ సుశీల ఉన్నారు.
డ్వామా పీడీ కల్యాణచక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment