మెగా పేరెంట్స్ – టీచర్స్ డేకు కార్యాచరణ రూపొందించండి
విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7న నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్ల సమావేశాలపై కార్యాచరణ రూపొందించాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. బుధవారం తన చాంబర్ నుంచి ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు పేర్కొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, స్ఫూర్తిదాయక వ్యక్తులను, పాఠశాల పూర్వ విద్యార్థులను, పాఠశాల యాజమాన్య కమిటీని, దాతలను దీనిలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఇందుకోసం గురువారం నుంచే పాఠశాల వారీగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి, శుక్రవారం నాటికి ఎంఈఓలకు, శనివారం నాటికి జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీల్లో కూడా ఈ సమావేశాలను నిర్వహించాలన్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టును వివరించడంతో పాటు, పాఠశాల అభివృద్ధికి సలహాలు, సూచనలను తీసుకోవాలని చెప్పారు. సమావేశం ఉదయం 9 గంటలకు మొదలై, మధ్యాహ్నం 1 గంటకు చక్కని శుభదిన భోజనంతో ముగుస్తుందని నిమిషాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల షెడ్యూల్‌ను వివరించారు. ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు ఒక్కో పాఠశాలకు అతిథులుగా హాజరవుతారని తెలిపారు. 12 రకాల కమిటీలను ఎస్‌ఎంసీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో వేయాలని చెప్పారు. డీఈఓ యూ.మాణిక్యంనాయుడు, బీసీ సంక్షేమాధికారి పెంటోజీరావు పాల్గొన్నారు.
సర్వేకు సంబంధించిన వినతులు పరిష్కరించాలి
భూముల సర్వేకు సంబంధించి వచ్చిన వినతులను గురువారం నాటికి పరిష్కరించి ఆన్‌లైన్‌లో సమోదు చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. సర్వే విభాగానికి సంబంధించిన వినతుల్లో 1,216 వరకు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అదే విధంగా రెవెన్యూ సమస్యలపై వచ్చిన మరో 424 వినతులను తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లతో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ, సర్వే సంబంధ ప్రజావినతుల పరిష్కాంపై బుధవారం సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, సర్వే విభాగం ఏడీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment