బెల్టు షాపులను ప్రోత్సహించొద్దు
● ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా డీసీ బాబ్జీరావు
రాజాం: గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహించవద్దని, బాల కార్మికులను షాపుల్లో పనులకు పెట్టుకోవద్దని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎస్‌వీవీఎన్ బాబ్జీరావు అన్నారు. రాజాం పట్టణంలో పాలకొండ రోడ్డుతో పాటు బొబ్బిలి రోడ్డులోని పలు వైన్ షాపులను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. నిబంధనలపై నిర్వాహకులకు అవగాహన కల్పించారు. రికార్డులు పరిశీలించారు. బెల్టుషాపులు ప్రోత్సహించవద్దని హెచ్చరించారు. అక్రమ మద్యం విక్రయాలు చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. సరుకు వివరాలు పక్కాగా రికార్డ్‌గా ఉండాలని వివరించారు. అనంతరం పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయాన్ని పరిశీలించారు. స్టేషన్లో కేసుల వివరాలు, రికార్డుల నిర్వహణపై ఆరా తీసారు. ఆయన వెంట రాజాం సీఐ ఆర్.జైభీమ్, సిబ్బంది ఉన్నారు.
రాజాం – పాలకొండ రైల్వే లైను అనుసంధానం చేయండి
● కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేసిన ఎంపీ అప్పలనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: రాజాం, పాలకొండ, సీతంపేట, కొత్తూరు, హడ్డుబంగి, పర్లాకిమిడి ప్రాంతాల మధ్య రైల్వే లైనును అనుసంధానం చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విజయనగరం ఎంపీ అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బుధవారం కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ప్రాజెక్టుపై డీపీఆర్ తయారీకి వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. ఒడిశా రాష్ట్రంతో అనుసంధానించుకునే విధంగా రైల్వే మార్గం ఏర్పాటు చేయడం అనేది ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రికి తెలిపారు. అదే విధంగా మీడియాలో పనిచేసే జర్నలిస్టులు, కెమెరామెన్‌లకు కోవిడ్ సమయం నుంచి రైల్వే పాసులను నిలిపివేశారని.. వీటిని వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజులతో కలిసి సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లారు.
భోగరాజుకు ప్రశంసలు
విజయనగరం టౌన్: తొమ్మిదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఖతార్ రాజధాని దోహాలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి, వాఖ్యాత, సంఘ సేవకురాలు భోగరాజు సూర్యలక్ష్మికి ప్రశంసల వర్షం కురిసింది. ఈ నెల 22, 23 తేదీల్లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళావేదికలు సంయుక్తంగా దోహాలో నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో జిల్లా నుంచి ఎంపికైన ఈమె ‘మహాకవి శ్రీశ్రీ కవిత్వం – అభ్యుదయం’ అనే అంశంపై ప్రసంగించి అందరి మన్ననలు పొందారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె రింగురోడ్డులో ఉన్న తన స్వగృహంలో మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వంగూరి ఫౌండేషన్ ప్రతినిధులు రాచకొండ సాయి, ఆంధ్రకళా వేదిక తరఫున వెంకట భాగవతుల చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
జనవరి 28న
పైడితల్లి అవతరణ దినోత్సవం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి ఆత్మార్పణ దినం (అవతరణ దినోత్సవం) వచ్చే ఏడాది జనవరి 28న నిర్వహించనున్నామని, ఆరోజున ప్రత్యేక పూజలు చేపట్టన్నుట్లు సాహితీవేత్త నాలుగెస్సుల రాజు అన్నారు. చదురుగుడి ఆధ్యాత్మిక కళావేదిక వద్ద అమ్మవారి దీక్షాపీఠం వ్యవస్థాపకుడు ఆర్.సూర్యపాత్రో, ఆలయ అధికారులతో బుధవారం మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2025 జనవరి 28న అమ్మవారి జీవితచరిత్ర పుస్తకాలను ఆవిష్కరించి, భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. భక్తులందరూ అమ్మవారి అవతరణ దినోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment