‘జైకా’ పనుల పూర్తికి గడువు పెంపు
● పెదంకలాం, వట్టిగెడ్డలకు మాత్రమే..
● మార్చి 2025 వరకు గడువు..
● మిగతా రెండింటికి అనుమతులు
రాని వైనం
● వైఎస్సార్‌సీపీ హయాంలోనే పనుల ప్రారంభం
● కాలువల లైనింగ్, శివారు ప్రాంతాలకు సాగునీరు
● గడువు పూర్తవడంతో నిలిచిన పనులు
బొబ్బిలి: మూడు దశాబ్దాలుగా జపాన్ నిధులతో పనులు చేపట్టేందుకు జిల్లాలోని నాలుగు ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వాటికి ఎన్నో కొర్రీలు పెట్టారు వివిధ స్థాయిల్లోని అధికారులు. చివరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టుల వద్ద కాలువల పూడిక తీతలు, లైనింగ్ పనులు కొంతమేర జరిగాయి. మిగతా పనులు జరిగేలోపు వాటి గడువు తీరిపోవడంతో కొన్నాళ్ల కిందట నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం పనులు చేపట్టాల్సిన చోట కాలువల్లో పిచ్చిమొక్కలు, పూడికలు మళ్లీ పెరిగిపోయాయి. ఆయా ప్రాజెక్టుల పనులు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయా అని ఎదురు చూడగా ఇప్పుడు రెండింటికి మాత్రమే అనుమతులు వచ్చాయి. ఇందులో వట్టిగెడ్డ, పెదంకలాం పనులకు జలవనరుల శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో ఆయా కాంట్రాక్టర్లకు గడువు పెంచుతూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. కానీ మిగతా పెద్దగెడ్డ, వీఆర్‌ఎస్ ప్రాజెక్టులకు ఇంకా అనుమతులు రాలేదు. అనుమతులు ఎప్పుడు వస్తాయి.. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారన్న డోలాయమానంలో రైతులున్నారు. ఏళ్ల తరబడి ప్రాజెక్టులు మరమ్మతుకు నోచుకోకపోవడంతో మంజూరైన నిధులతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ముందుగా కాలువల సిల్టింగ్ తొలగింపు పనులు చేపట్టడం, జిల్లాలో ఎక్కడా లేని లైనింగ్ పనులు ప్రారంభం కావడంతో రైతులు ఆనందపడ్డారు. ఇంతలోనే పనులు నిలిచిపోయాయి. జిల్లాలో నాలుగు ప్రాజెక్టులను ఆధునీకరించేందుకు నిధులు మంజూరవడం, పనులు ప్రారంభించుకోవడం ఒక విషయమైతే అన్ని ప్రాజెక్లుల్లోనూ కాలువల సిల్ట్ తొలగింపు శివారు భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కాలువల పనులు చేపట్టారు. ఇది ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడుదల చేసే ముందు కావడం విశేషం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తుందా.. లేదన్నది మీమాంసగా మిగిలిపోయింది. గతంలో పనులు జరిగేటప్పుడు ఏటా ఖరీఫ్ సమయంలో పనులు నిలిపి వేసి రైతులకు సాగునీరు పూర్తి స్థాయిలో ఇచ్చి నేరుగా పంట కాలం పూర్తయ్యాక సాగునీటిని నిలిపివేసి తిరిగి పనులు ప్రారంభించేవారు. ఇప్పుడు పనులు జరుగతాయానన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
రెండింటికి గడువు పెంచారు
వట్టిగెడ్డ, పెదంకలాం ప్రాజెక్టులకు ఆధునీకరణ పనుల కోసం గడువు పెంచుతూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు చేపడతారు.
– నారాయణ రావు,
డీఈఈ, బొబ్బిలి
Comments
Please login to add a commentAdd a comment